చంద్ర‌బాబు వ‌దిలివెళ్లిన బ‌కాయిల‌ను జ‌గ‌న్ క‌డుతున్నారు: మంత్రి రోజా

  • బాబు వ‌దిలి వెళ్లిన ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బ‌కాయిలు రూ.1,800 కోట్లు
  • ప్ర‌స్తుతం ప్ర‌తి మూడు నెల‌లకోమారు నిధుల విడుద‌ల‌
  • డిస్కంల‌కు చంద్ర‌బాబు రూ.28 వేల కోట్లు బ‌కాయి పెట్టార‌న్న‌ రోజా
టీడీపీ అధినేత‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబునాయుడు తీరుపై ఏపీ మంత్రి ఆర్కే రోజా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఫీజు రీయింబ‌ర్స్‌మెంటుకు సంబంధించి చంద్ర‌బాబు వ‌దిలి వెళ్లిన రూ.1,800 కోట్ల బ‌కాయిల‌ను సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చెల్లిస్తున్నార‌ని రోజా అన్నారు. చంద్ర‌బాబు వ‌దిలి వెళ్లిన బ‌కాయిల‌ను చెల్లించ‌డ‌మే కాకుండా విద్యార్థుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌ని రీతిలో ప్ర‌తి మూడు నెల‌లకు ఒక‌సారి ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ నిధుల‌ను విడుద‌ల చేస్తున్నామ‌ని ఆమె చెప్పారు.

ఈ నెల 5న సీఎం జ‌గ‌న్ శ్రీబాలాజి జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. తిరుపతిలో జరగనున్న జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన ఏర్పాట్ల‌ను స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి మంగ‌ళవారం రోజా ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా రోజా మీడియాతో మాట్లాడారు. తాను మంత్రిని అయ్యిన త‌ర్వాత సీఎం జ‌గ‌న్ త‌న జిల్లాకు తొలిసారి ప‌ర్య‌ట‌న కోసం వ‌స్తున్నారని రోజా చెప్పారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు పాల‌న‌ను గుర్తు చేస్తూ, ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ నిధుల‌ను చెల్లించ‌కుండా చంద్ర‌బాబు నిర్లక్ష్యం చేశార‌ని ఆమె మండిప‌డ్డారు. జగ‌న్ అధికారంలోకి వ‌చ్చాక విద్య‌, వైద్య రంగాల‌కు ప్ర‌త్యేక ప్రాధాన్యం ద‌క్కింద‌న్నారు.

ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని చంద్రబాబు చూస్తే.. సీఎం జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశార‌ని రోజా చెప్పారు. డిస్కంలకు చంద్రబాబు హయాంలో రూ.28 వేల కోట్లు బకాయిలు పెట్టారని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో విద్యుత్ ఛార్జీలు పెంచారని రోజా అన్నారు. ధరలు కొద్దిగా పెంచిన దానికి ఆగమాగం చేస్తున్నారంటూ విప‌క్షాల‌పై మండిప‌డ్డ రోజా... సీఎం జగన్‌ కరోనా కష్టకాలంలో సంక్షేమ పథకాలను అందించారని రోజా గుర్తు చేశారు.


More Telugu News