‘మోదీ వన్స్ మోర్..’ నినాదంతో దద్దరిల్లిన బెర్లిన్

  • బెర్లిన్ లోని పాట్స్ డామర్ ప్లాట్జ్ థియేటర్ లో కార్యక్రమం 
  • 'ట్వెంటీ ట్వెంటీ ఫోర్.. మోదీ వన్స్ మోర్' అంటూ భారత సంతతి నినాదాలు 
  • భారత్ సరికొత్త శక్తితో ముందుకు సాగుతోందన్న మోదీ  
  • నూతన భారత్ రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా వుందంటూ వ్యాఖ్య  
కేంద్రంలోని బీజేపీ సర్కారుకు 2024 నాటి ఎన్నికల కోసం గట్టి నినాదం లభించింది..! జర్మనీ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. బెర్లిన్ లోని పాట్స్ డామర్ ప్లాట్జ్ థియేటర్ లో భారత సంతతి ప్రజలతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా సభా వేదికపైకి మోదీ వస్తున్న సమయంలో ‘ట్వెంటీ ట్వెంటీ ఫోర్.. మోదీ వన్స్ మోర్’ అంటూ అక్కడికి వచ్చిన వారు నినాదాలతో హోరెత్తించారు. 

భారత కమ్యూనిటీ ప్రజలను ఉద్దేశించి గంట పాటు మోదీ ప్రసంగించారు. కార్యక్రమం ఆసాంతం మోదీ.. మోదీ.. భారత్ మాతాకీ జై, మోదీ హై తో ముమ్ కిన్ హై, 2024 మోదీ వన్స్ మోర్.. నినాదాలతో థియేటర్ దద్దరిల్లిందనే చెప్పుకోవాలి. 

దీనికి మోదీ స్పందిస్తూ.. ‘‘నా గురించి లేదా మోదీ సర్కారు గురించి మాట్లాడేందుకు నేను ఇక్కడకు రాలేదు. భారత చిన్నారులను జర్మనీలో కలుసుకునే అవకాశం నాకు లభించడం అదృష్టంగా భావిస్తున్నా’’ అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. భారత్ సరికొత్త శక్తితో ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. మూడు దశాబ్దాల రాజకీయ అనిశ్చితికి ఓటు అనే బటన్ తో తెరపడినట్టు పేర్కొన్నారు. 

‘‘నూతన భారత్ రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. ఆవిష్కరణలకు, ఇంక్యుబేషన్ కు సిద్ధంగా ఉంది. 2014లో 200-400 మధ్య స్టార్టప్ లు ఉంటే ప్రస్తుతం 68,000కు పెరిగాయి. పదుల సంఖ్యలో యూనికార్న్ లు (బిలియన్ డాలర్లకు పైన విలువ ఉన్నవి) ఉన్నాయి. వాటిల్లో కొన్ని 10 బిలియన్ డాలర్ల వ్యాల్యూషన్ తో డెకాకార్న్ లుగా అవతరించనున్నాయి’’ అని మోదీ పేర్కొన్నారు.


More Telugu News