దాంట్లో తప్పేముంది?.. రాహుల్ గాంధీ వీడియోపై కాంగ్రెస్ స్పందన

  • స్నేహితుడి పెళ్లికి వెళ్లారన్న రణ్ దీప్ సుర్జేవాలా 
  • పెళ్లి, నిశ్చితార్థానికి వెళ్లడం మన సంస్కృతని వ్యాఖ్య 
  • అదేమీ నేరం కాదంటూ వివరణ 
రాహుల్ గాంధీ నేపాల్ పర్యటన దుమారం రేపుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ వివరణ ఇచ్చింది. అందులో తప్పేముందంటూ  పార్టీ ప్రధాన కార్యదర్శి రణ్ దీప్ సుర్జేవాలా అన్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఖాట్మండు నైట్ క్లబ్ లో రాహుల్ ఎంజాయ్ చేస్తున్న వీడియోను బీజేపీ ట్వీట్ చేయడంపై మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. దేశంలో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టాలని, అనవసరంగా తమ నేతపై పడొద్దని బీజేపీకి చురకలంటించారు. 

తన స్నేహితుడి పెళ్లికి రాహుల్ నేపాల్ వెళ్లారని చెప్పారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం అక్కడకు వెళ్లారని తెలిపారు. దేశంలో ఉన్న విద్యుత్ సంక్షోభం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలపై బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కానీ, వారికి రాహుల్ వ్యక్తిగత విషయాలపై ప్రచారం చేయడానికి మాత్రం సమయం ఉంటుందని విమర్శించారు. 

తెలిసిన వారి పెళ్లి, నిశ్చితార్థానికి వెళ్లడం మన దేశ సంస్కృతి, సంప్రదాయాలని, అదేమీ పెద్ద నేరం కాదని అన్నారు. పాకిస్థాన్ కు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లినట్టు.. రాహుల్ గాంధీ ఆహ్వానం లేకుండా నేపాల్ కు వెళ్లలేదన్నారు. కాంగ్రెస్ పై బీజేపీ అసత్యాలు ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ అన్నారు. ఓ ప్రైవేట్ పెళ్లికి వెళితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు.


More Telugu News