జోధ్ పూర్ లో హిందూ, ముస్లింల మధ్య ఘర్షణ.. రంజాన్ రోజున తీవ్ర ఉద్రిక్తత!

  • ఈ తెల్లవారుజామున చెలరేగిన ఉద్రిక్తతలు
  • పోలీసుల భద్రత మధ్యే కొనసాగుతున్న నమాజ్ కార్యక్రమం
  • అందరూ శాంతియుతంగా ఉండాలన్న సీఎం గెహ్లాట్
రాజస్థాన్ లోని జోధ్ పూర్ నగరంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రంజాన్ పర్వదినమైన ఈరోజు తెల్లవారుజామున ఉద్రిక్తతలు తలెత్తాయి. జలోరీ గేట్ వద్ద జెండాలు ఎగురవేయడం ఘర్షణకు దారి తీసింది. మరోవైపు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా ప్రచారం జరగకుండా ఆపడానికి అధికారులు వెంటనే ఇంటర్నెట్ ను ఆపేశారు. ఈరోజు రంజాన్ సందర్భంగా పోలీసు భద్రత మధ్యే నమాజ్ జరుగుతోంది. 

పరశురామ్ జయంతి పండుగ నేపథ్యంలో మూడు రోజుల ఉత్సవాలు కూడా జోధ్ పూర్ లో జరుగుతున్నాయి. పరశురామ్ జయంతి, రంజాన్ రెండు పండుగల నేపథ్యంలో ఇరు మతస్థులు వారివారి మతపరమైన జెండాలను ఎగురవేశారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య వాదన ప్రారంభమై, చివరకు ఘర్షణకు దారి తీసింది. 

ఈ నేపథ్యంలో జనాలను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయుగోళాలను ప్రయోగించారు. ఇదే సమయంలో పోలీసులపై కూడా కొందరు రాళ్లు రువ్వారు. ఈ రాళ్ల దాడిలో నలుగురు పోలీసులు గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను రంగంలోకి దించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందిస్తూ, అందరూ శాంతియుతంగా ఉండాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 


More Telugu News