ఎన్టీపీసీ సింహాద్రిలో నిలిచిన విద్యుదుత్పత్తి.. అంధకారంలో పరిసరాలు

  • అర్ధరాత్రి వేళ నిలిచిపోయిన విద్యుదుత్పత్తి
  • ఒకేసారి నాలుగు యూనిట్లలో నిలిచిపోవడం ఇదే తొలిసారంటున్న అధికారులు
  • గ్రిడ్ నుంచి కూడా నిలిచిపోయిన సరఫరా
  • రెండున్నర గంటలు శ్రమించి పాక్షికంగా పునరుద్ధరించిన అధికారులు
విశాఖపట్టణం సమీపంలోని ఎన్టీపీసీ సింహాద్రిలోని 4 యూనిట్లలో ఒకేసారి విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఫలితంగా ఉదయం 3 గంటల నుంచి 2 వేల మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో ఎన్టీపీసీ పరిసరాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు విద్యుదుత్పత్తిని పునరుద్ధరించే చర్యలు చేపట్టారు. ఒకేసారి నాలుగు యూనిట్లలో విద్యుదుత్పత్తి ఎప్పుడూ నిలిచిపోలేదని అధికారులు తెలిపారు. 

గ్రిడ్‌ నుంచి కూడా ఎన్టీపీసీ సింహాద్రికి విద్యుత్ సరఫరా కావడం లేదు. దీనికి తోడు గత అర్ధరాత్రి నుంచి పరవాడ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తుండడం మరింత ఇబ్బందిగా మారింది. మరోవైపు, ఉమ్మడి విశాఖ జిల్లాకు అవసరమైన కలపాల 400 కేవీ విద్యుత్ స్టేషన్‌కు గ్రిడ్ నుంచి సరఫరా నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో చీకట్లు రాజ్యమేలాయి. కాగా, దాదాపు రెండున్నర గంటలు శ్రమించిన అధికారులు గ్రిడ్ నుంచి ఎన్టీపీసీ సింహాద్రికి విద్యుత్‌ను పునరుద్ధరించి పాక్షికంగా సరఫరా చేస్తున్నారు.


More Telugu News