రియాల్టీ షో పేరుతో ఏదైనా చూపిస్తామంటే.. కళ్లుమూసుకుని ఉండలేం: ఏపీ హైకోర్టు సీరియస్

  • బిగ్‌బాస్ షో అసభ్యతను, అశ్లీలతను పెంచేదిగా ఉందంటూ 2019లో కేతిరెడ్డి పిల్
  • హింసను ప్రోత్సహిస్తూ సంస్కృతి అని ఎలా అంటారని నిలదీసిన ధర్మాసనం
  • సీజే నేతృత్వంలోని బెంచ్ ఎదుట అభ్యర్థించేందుకు పిటిషనర్‌కు వెసులుబాటు
  • విచారణ నుంచి వ్యాజ్యాన్ని తొలగించిన న్యాయస్థానం
రియాల్టీ షో పేరుతో ఏది పడితే అది చూపిస్తామంటే కుదరదని, తాము కళ్లు మూసుకుని కూర్చోలేమని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. షోలో హింసను ప్రోత్సహిస్తూ సంస్కృతి అని ఎలా అంటారని ప్రశ్నించింది. బిగ్‌బాస్ షో అసభ్యతను, అశ్లీలతను ప్రోత్సహించేలా ఉందని పేర్కొంటూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి గతంలో హైకోర్టులో పిల్ వేశారు. ఈ వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారించాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి ఇటీవల కోర్టును అభ్యర్థించారు. దీంతో సోమవారం విచారణకు వచ్చింది.

జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఎస్.సుబ్బారెడ్డితో కూడిన ధర్మాసనం దీనిని విచారించింది. పిటిషనర్ సరైన కారణంతోనే పిల్ వేశారని న్యాయస్థానం అభిప్రాయపడింది. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌ రెడ్డి తన వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ ఇలాంటి వ్యాజ్యాన్నే తెలంగాణ హైకోర్టులో వేసి ఉపసంహరించుకున్నారని తెలిపారు. రియాలిటీ షోల నిర్వహణకు విధివిధానాలు ఉంటాయన్నారు. వివిధ సంస్కృతుల ఆధారంగా షోలు ఉంటాయని తెలిపారు.

ఆ సమయంలో కల్పించుకున్న ధర్మాసనం హింసను ప్రోత్సహించడం సంస్కృతి ఎలా అవుతుందని నిలదీసింది. న్యాయవాది తన వాదనలు కొనసాగిస్తూ.. 2019లో ఈ వ్యాజ్యం దాఖలైనట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై అత్యవసర విచారణ జరపాలని ప్రధాన న్యాయమూర్తి నేతృతంలోని బెంచ్‌ను పిటిషనర్ తరపు న్యాయవాది కోరారని, అయితే అందుకు అనుమతి రాలేదని అన్నారు. పిటిషనర్ ఈ విషయాన్ని ఇన్‌చార్జ్ కోర్టుకు చెప్పకుండా విచారణకు అనుమతి పొందారని అన్నారు.

పిటిషనర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. ఈ వ్యాజ్యాలపై విచారణ జరపాలని సీజే నేతృత్వంలోని బెంచ్‌ను కోరడం నిజమేనని అంగీకరించారు. అలా కోరే హక్కు పిటిషనర్‌కు ఉందన్నారు. మరలాంటప్పుడు ఆ విషయాన్ని ఎందుకు దాచారని న్యాయస్థానం ప్రశ్నించింది. కోర్టులో నిజాయతీగా వ్యవహరించాలని సూచించింది. 

కాగా, ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ అవసరమని భావిస్తే ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్‌ ఎదుట అభ్యర్థించేందుకు పిటిషనర్‌కు వెసులుబాటు కల్పిస్తున్నట్టు చెప్పిన న్యాయస్థానం ఈ వ్యాజ్యాన్ని విచారణ నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది.


More Telugu News