మంత్రి వేణుగోపాలకృష్ణ క్షమాపణలు చెప్పాలంటూ శెట్టిబలిజ సంఘం డిమాండ్

  • మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయి సంస్మరణ సభ
  • హాజరైన వైవీ సుబ్బారెడ్డి, మంత్రి చెల్లుబోయిన
  • వైవీ ముందు మోకరిల్లిన మంత్రి
  • శెట్టిబలిజలుగా శిరసు వంచి నమస్కరిస్తున్నామని ప్రకటన
ఇటీవల మాజీ శాసనసభ్యుడు కుడిపూడి చిట్టబ్బాయి సంస్మరణ సభ నిర్వహించగా, ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విచ్చేశారు. అయితే, ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.... వైవీ సుబ్బారెడ్డి ముందు మోకరిల్లారు. కుడిపూడి చిట్టబ్బాయి కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చి, ఊహించని విధంగా ఆర్థికసాయం అందించేందుకు కారకులైన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి, సీఎం జగన్ కు శెట్టిబలిజలుగా జన్మజన్మలా శిరసు వంచి నమస్కరిస్తానని మంత్రి వేణుగోపాలకృష్ణ భావోద్వేగాలతో కూడిన ప్రకటన చేశారు. 

దీన్ని శెట్టిబలిజ సంఘం తీవ్రంగా తప్పుబట్టింది. శెట్టిబలిజల పరువు తీశారంటూ మంత్రిపై మండిపడింది. కోనసీమ జిల్లా పి.గన్నవరంలో నేడు శెట్టిబలిజ సంఘం నేతలు సమావేశమై మంత్రి వేణుగోపాలకృష్ణ తీరుపై చర్చించారు. పి.గన్నవరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. 

ఓ మంత్రి హోదాలో ఉంటూ కూడా మోకరిల్లి, శెట్టిబలిజ కులం పట్ల అవమానకరంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శెట్టిబలిజ జాతికి మంత్రి వేణుగోపాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే శెట్టిబలిజ జాతి గుణపాఠం చెబుతుందని ఆ సంఘం నేతలు స్పష్టం చేశారు.


More Telugu News