జెలెన్ స్కీని హిట్లర్ తో పోల్చిన రష్యా విదేశాంగ మంత్రి... మండిపడిన ఇజ్రాయెల్

  • ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు
  • ఇరుదేశాల నేతల మధ్య మాటల యుద్ధం
  • హిట్లర్, జెలెన్ స్కీ మనస్తత్వాలు ఒక్కటేనన్న లవ్రోవ్
  • ఇద్దరిలో యూదు రక్తం ప్రవహిస్తోందని వ్యాఖ్యలు
  • లవ్రోవ్ వ్యాఖ్యలను ఖండించిన ఇజ్రాయెల్ మంత్రి 
ఓవైపు రష్యా, ఉక్రెయిన్ సేనలు దాడులు ప్రతిదాడులతో పోరాటం సాగిస్తుండగా, ఇరుదేశాల ప్రభుత్వ నేతల మధ్య మాటల యుద్ధం కూడా నడుస్తోంది. తాజాగా, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీని ఉద్దేశించి విమర్శనాస్త్రాలు సంధించారు. జెలెన్ స్కీని జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ తో పోల్చారు. హిట్లర్, జెలెన్ స్కీ ఇద్దరూ కూడా నాజీలేనని, వారిద్దరిలో ప్రవహిస్తున్నది యూదు రక్తమేనని అన్నారు.

అయితే, రష్యా విదేశాంగ మంత్రి 'యూదు రక్తం' వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ మండిపడింది. దీనిపై ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి యాయిర్ లాపిడ్ ఘాటుగా స్పందించారు. రష్యా మంత్రి లవ్రోవ్ చేసిన వ్యాఖ్యలు క్షమించరానివని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ దారుణమైన ప్రకటన చేయడం ద్వారా చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారని మండిపడ్డారు. నాటి మారణహోమంలో యూదులు తమను తాము చంపుకోలేదని లాపిడ్ స్పష్టం చేశారు. యూదులు ఎదుర్కొన్నది ఓ మోస్తరు జాతివివక్షేనని, అంతకంటే ఎక్కువగా యూదులు తమలో తామే వైరిభావం ప్రదర్శించారని ప్రచారం చేస్తున్నట్టుగా లవ్రోవ్ వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు.


More Telugu News