ఆటోగ్రాఫ్ ప్లీజ్.. ధోనీని రిక్వెస్ట్ చేసిన దిగ్గజ ఆటగాడు

  • అభిమాన క్రికెటర్ ను కలుసుకున్న డేన్ విలియమ్ స్టిన్
  • ధోనీతో జెర్సీపై ఆటోగ్రాఫ్ తీసుకున్న వైనం 
  • చెన్నై కెప్టెన్ కు మైదానంలో ఘన స్వాగతం
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో మహేంద్ర సింగ్ ధోనీ సీఎస్కే కెప్టెన్ గా తన విజయ యాత్ర మొదలు పెట్టాడు. ఆదివారం సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ ఇందుకు వేదిక. ఆడిన మొదటి ఎనిమిది మ్యాచుల్లో ఆరింటిలో ఓటమి పాలు కావడంతో కెప్టెన్సీ నుంచి రవీంద్ర జడేజా తప్పుకోవడం తెలిసిందే. దీంతో ఆ పగ్గాలు తిరిగి ధోనీకే వెళ్లాయి. ధోనీ సారథ్యం, స్థానికుడు రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్ కావడంతో పూణెలోని ఎంసీఏ స్టేడియం సీఎస్కే అభిమానులతో నిండిపోయింది. 

ఇక టాస్ సందర్భంగా ధోనీ మైదానంలోకి వస్తున్న తరుణంలో అభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టారు. ఉత్సాహంతో అతడికి స్వాగతం పలికారు. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన 40 ఏళ్ల ధోనీ కేవలం ఐపీఎల్ కోసమే ఆడుతున్నాడు. అయినా ఇప్పటికీ ధోనీ పట్ల అభిమానం కొంచెం కూడా తగ్గలేదు. ఈ వయసులోనూ ధోనీ చూపిస్తున్న ప్రతిభను చూసి కొత్త వారు కూడా ఆయనకు అభిమానులుగా మారుతున్నారు. 

ఈ క్రమంలో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, గొప్ప ఫౌస్ట్ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన డేల్ విలియమ్ స్టిన్ ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ కోచింగ్ స్టాఫ్ గా సేవలు అందిస్తున్నాడు. అతడికి ధోనీ అంటే ఎంతో అభిమానం ఉందని నిన్నటి ఘటన చూస్తే తెలుస్తోంది. మైదానంలోకి వచ్చి మరీ ధోనీ నుంచి ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. క్రికెట్ ప్రపంచంలో ధోనీని ఎంతో మంది అభిమానిస్తారు, గౌరవిస్తారన్న సంగతి తెలిసిందే. ఆ విషయం మరోసారి విలియమ్ స్టిన్ రూపంలో కనిపించింది. విలియమ్ స్టిన్ పట్టుకు వచ్చిన జెర్సీని ధోనీ పరిశీలనగా చూస్తూ దానిపై తన ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఈ ఫొటో ఇప్పుడు తెగ షేర్ అయిపోతోంది.


More Telugu News