లౌడ్ స్పీకర్లు తొలగించకపోతే ఏం జరుగుతుందో చూద్దురుగాని..: రాజ్ థాకరే హెచ్చరిక

  • మసీదులపై లౌడ్ స్పీకర్లు తొలగించాల్సిందేనన్న రాజ్ 
  • లేదంటే రెట్టింపు శబ్దంతో హనుమాన్ చాలీసా పారాయణం వినిపిస్తామని వ్యాఖ్య 
  • ముస్లింలకు మహారాష్ట్ర శక్తి ఏంటో చూపిస్తామని హెచ్చరిక 
మసీదులపై లౌడ్ స్పీకర్లను తొలగించాలన్న తన డిమాండ్ విషయంలో ‘తగ్గేదేలే’ లేదని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీప్ రాజ్ థాకరే మరోసారి తేల్చి చెప్పారు. మే 3 నాటికి లౌడ్ స్పీకర్లను తొలగించాలంటూ మహారాష్ట్ర సర్కారుకు రాజ్ థాకరే గడువు విధించారు. లౌడ్ స్పీకర్లు తొలగించకపోతే తాము మౌనంగా ఉండబోమని ఆయన తాజాగా ప్రకటన చేశారు. తమ పార్టీ కార్యకర్తలు హనుమాన్ చాలీసాను లౌడ్ స్పీకర్లలో వినిపిస్తారని తెలిపారు. ఔరంగాబాద్ లో పర్యటన సందర్భంగా రాజ్ థాకరే ఈ అంశంపై మాట్లాడారు.

‘‘మే 4 తర్వాత మహారాష్ట్రలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఇప్పటికైనా వెళ్లి లౌడ్ స్పీకర్లను తీసివేయాలని పోలీసులకు నా సూచన’’ అని రాజ్ థాకరే పేర్కొన్నారు. ‘‘ముస్లింలు అర్థం చేసుకోకపోతే వారికి మహారాష్ట్ర శక్తిని చూపిస్తాం. మసీదులపై లౌడ్ స్పీకర్ల శబ్దం కంటే రెట్టింపు స్థాయిలో హనుమాన్ చాలీసాను హిందువులు అందరూ ప్లే చేయాలి’’ అని రాజ్ థాకరే పిలుపునిచ్చారు. 

ఆలయాలు, ఇతర ప్రార్థనా స్థలాల నుంచి లౌడ్ స్పీకర్లను సైతం తొలగించాల్సిందేనని.. దీనికంటే ముందు వారు మసీదుల నుంచి వాటిని తొలగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 

‘‘ఒక జర్నలిస్ట్ లౌడ్ స్పీకర్ల విషయంలో మీరు ఎందుకు ఈ వాదన ఎత్తుకున్నారని నన్ను ప్రశ్నించాడు. మేము హనుమాన్ చాలీసాను ప్లే చేస్తాం. దాన్ని ముస్లింలు వినాలని చెప్పాను. ఓ నాసిక్ జర్నలిస్ట్ తాను సైతం ముస్లిం వ్యక్తినని, లౌడ్ స్పీకర్లతో తాను కూడా ఇబ్బంది పడుతున్నానని చెప్పాడు. అతడి పిల్లలు నిద్రపోలేక ఇబ్బంది పడుతున్నట్టు బాధను వ్యక్తం చేశాడు’’ అని రాజ్ థాకరే పేర్కొన్నారు.


More Telugu News