తన భర్త ముగ్గురు భార్యలను తెచ్చుకోవాలని ఏ ముస్లిం మహిళా కోరుకోదు: అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ

  • మహిళల ప్రాథమిక హక్కులను కాపాడాలన్న సీఎం  
  • ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాల్సిందేనని వ్యాఖ్య 
  • లేదంటే బహుభార్యత్వం కొనసాగుతుందని కామెంట్ 
ఉమ్మడి పౌర స్మృతిని (యూసీసీ) భారత్ లో తప్పకుండా అమలు చేసి తీరాలని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అభిప్రాయపడ్డారు. ముస్లిం మహిళల ప్రయోజనాల పరిరక్షణకు ఇది అవసరమని చెప్పారు. ఏ ముస్లిం మహిళ కూడా తన భర్త ముగ్గురు భార్యలను తెచ్చుకోవాలని కోరుకోదని వ్యాఖ్యానించారు. 

‘‘దేశంలో ఉమ్మడి పౌర స్మృతిని కనుక అమలు చేయకపోతే బహుభార్యత్వం అనే విధానం కొనసాగుతుంది. దాంతో పురుషులు (ముస్లిం) ఎక్కువ సార్లు వివాహం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కనుక మహిళల ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన అవసరం ఉంది’’ అని సీఎం బిశ్వశర్మ పేర్కొన్నారు.

ఉమ్మడి పౌర స్మృతికి వ్యతిరేకంగా అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు చేసిన వ్యాఖ్యలపై దుమారం నెలకొనడంతో.. బిశ్వశర్మ ఇలా స్పందించారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ ను భారత్ లో ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయని.. ఇది రాజ్యాంగ విరుద్ధమైన, మైనారిటీలకు వ్యతిరేకమైన చర్యగా ముస్లిం పర్సనల్ లా బోర్డు పేర్కొంది. 

అయితే, ఉమ్మడి పౌర స్మృతి అన్నది మొదటి నుంచీ బీజేపీ అజెండాలో భాగంగానే ఉంది. అంటే అన్ని మతాల వారికీ ఒక్కటే పౌర చట్టం వర్తింపజేయడం. వివాహాలు, విడాకులు, దత్తత, వారసత్వం ఇలాంటి అంశాలన్నింటిలోనూ ఉమ్మడి పౌర స్మృతి ప్రామాణికం అవుతుంది. దీని ప్రకారం, మతాల వారీగా ప్రత్యేకమైన చట్టం, హక్కులు ఉండవు.


More Telugu News