అక్షర్ పోరాటం వృథా... పోరాడి ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్

  • 6 పరుగుల తేడాతో గెలిచిన లక్నో
  • ఢిల్లీ టార్గెట్ 196 రన్స్
  • 20 ఓవర్లలో 7 వికెట్లకు 189 రన్స్ చేసిన ఢిల్లీ
  • 42 పరుగులతో నాటౌట్ గా నిలిచిన అక్షర్ పటేల్
లక్నో సూపర్ జెయింట్స్ తో పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ పోరాడి ఓడింది. 196 పరుగుల లక్ష్యఛేదనలో ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 189 పరుగులు చేసింది. ఆఖర్లో ఢిల్లీ ఆటగాడు అక్షర్ పటేల్ దూకుడుగా ఆడినా ఫలితం లేకపోయింది. ఆఖరి ఓవర్లో 21 పరుగులు అవసరం కాగా, స్టొయినిస్ వేసిన తొలి బంతిని అక్షర్ సిక్సర్ బాదడంతో సమీకరణం మారింది. కానీ ఆ తర్వాత బంతుల్లో అక్షర్ పరుగులు సాధించలేకపోయాడు. ఇన్నింగ్స్ ఆఖరి బంతిని సిక్సర్ కొట్టినా అప్పటికే ఢిల్లీ పరాజయం ఖరారైపోయింది. అక్షర్ పటేల్ 24 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 42 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 

అంతకుముందు, ఓపెనర్లు పృథ్వీ షా (5), డేవిడ్ వార్నర్ (3) విఫలం కావడం ఢిల్లీ అవకాశాలపై ప్రభావం చూపింది. కెప్టెన్ రిషబ్ పంత్ (44), మిచెల్ మార్ష్ (37) రాణించినా కీలక దశలో వారిద్దరూ అవుటయ్యారు. రోవ్ మాన్ పావెల్ 21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 35 పరుగులు చేసి ఢిల్లీకి విజయంపై ఆశలు కల్పించాడు. చివర్లో అక్షర్ కు తోడు కుల్దీప్ యాదవ్ (8 బంతుల్లో 16 రన్స్) కూడా ధాటిగా ఆడినా ప్రయోజనం లేకపోయింది. లక్నో జట్టు 6 పరుగుల తేడాతో మ్యాచ్ ను కైవసం చేసుకుంది. 

లక్నో బౌలర్లలో మొహిసిన్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీశాడు. చమీర 1, రవి బిష్ణోయ్ 1, కృష్ణప్ప గౌతమ్ 1 వికెట్ తీశారు. ఈ విజయంతో లక్నో జట్టు పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి ఎగబాకింది. 

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్

ఐపీఎల్ డబుల్ హెడర్ లో భాగంగా నేటి రెండో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన సన్ రైజర్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు పుణేలోని ఎంసీఏ స్టేడియం వేదిక. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై జట్టు 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే ఆడుతున్నారు.


More Telugu News