గూగుల్ సెర్చ్ లో మీ సమాచారం కనిపిస్తోందా..? డిలీట్ చేసుకునే మార్గం ఇదే..
- ఫోన్, మెయిల్, చిరునామా వివరాలు
- కనిపిస్తే వెంటనే గూగుల్ కు తెలియజేయాలి
- వాటిని తొలగించాలంటూ దరఖాస్తు చేసుకోవచ్చు
గూగుల్ సెర్చ్ బార్ లో మీ పేరును టైప్ చేసినప్పుడు ఫోన్ నంబర్ కనిపిస్తోందా..? మీ చిరునామా కనిపిస్తోందా..? ఈ మెయిల్ ఐడీ కనిపిస్తోందా..? ఈ విధమైన వ్యక్తిగత సమాచారాన్ని తొలగించుకునే మార్గం ఉంది. దీన్ని తొలగించాలంటూ గూగుల్ ను కోరితే సరిపోతుంది. యూజర్ల వ్యక్తిగత గుర్తింపు సమాచారాన్ని గూగుల్ సెర్చ్ ఫలితాల నుంచి తొలగిస్తున్నట్టు గూగుల్ సైతం బ్లాగ్ పోస్ట్ ద్వారా ప్రకటించింది.
గూగుల్ సెర్చ్ లో యూజర్లు తమకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం ఏది కనిపించినా తొలగించాలంటూ గూగుల్ ను కోరితే చాలు. ఇందుకోసం గూగుల్ సపోర్ట్ పేజీకి వెళ్లాలి. అక్కడ ‘రిక్వెస్ట్’ను సమర్పించాల్సి ఉంటుంది. పేజీలో కనిపించే కాలమ్స్ లో వివరాలు నింపాలి. మీరు గుర్తించిన సమాచారం లింక్స్ ను అక్కడ పేస్ట్ చేయాలి. అడిగిన అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత సబ్ మిట్ చేస్తే చాలు.
మీ నుంచి రిక్వెస్ట్ వచ్చినట్టు గూగుల్ ధ్రువీకరణ సందేశం పంపిస్తుంది. ఆ తర్వాత దరఖాస్తు ప్రకారం సమాచారాన్ని విశ్లేషిస్తుంది. కావాలంటే ఏదైనా అదనపు సమాచారాన్ని గూగుల్ కోరొచ్చు. ఈ మెయిల్ ద్వారా ఈ సమచారం వస్తుంది. అన్ని అంశాలను నిర్ధారించుకున్న తర్వాత యూజర్ వ్యక్తిగత సమాచారాన్ని సెర్చ్ బార్ నుంచి తొలగిస్తుంది. కానీ, ఆ వివరాలన్నీ మరో థర్డ్ పార్టీ పోర్టల్ లో చేరి ఉంటే అందుకు గూగుల్ బాధ్యత ఉండదు.