ముంబై గెలిచిందోచ్.. రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో తొలి విజయం

  • 9వ మ్యాచ్‌లో బోణీ కొట్టిన ముంబై
  • సమష్టిగా రాణించిన రోహిత్ సేన
  • సూర్యకుమార్ యాదవ్ అర్ధ సెంచరీ
  • గెలిచినా అట్టడుగునే ముంబై
ఈ సీజన్‌లో అతి చెత్తగా ఆడుతూ తొలి ఎనిమిది మ్యాచుల్లో పరాజయం పాలైన ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు ఖాతా తెరిచింది. గత రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించి బోణీ కొట్టింది. తొలుత బౌలర్లు రాణించి రాయల్స్‌ను 158 పరుగులకే కట్టడి చేయగా, ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ అర్ధ సెంచరీతో అదరగొట్టడంతో ముంబై విజయం సాధించింది. 159 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. 

కెప్టెన్ రోహిత్ శర్మ షరా మామూలుగానే ఈ మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. రెండు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ కూడా క్రీజులో నిలవలేకపోయాడు. 18 బంతుల్లో 26 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అయితే, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సూర్యకుమార్ యాదవ్ మరోమారు చక్కని ఇన్నింగ్స్ ఆడాడు. 39 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్ధ సెంచరీ (51) చేసి జట్టును విజయం దిశగా నడిపించాడు. తిలక్ వర్మ 35, కీరన్ పొలార్డ్ 10 పరుగులు చేశారు. చివర్లో టిమ్ డేవిడ్ 9 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 20 పరుగులు చేయగా, డేనియల్ శామ్స్ ఎదుర్కొన్న తొలి బంతినే స్టాండ్స్‌లోకి పంపి జట్టుకు తొలి విజయాన్ని అందించాడు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగుల ఓ మోస్తరు స్కోరు చేసింది. జోస్ బట్లర్ ఒక్కడే రాణించి 52 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. అతడి తర్వాత అశ్విన్ చేసిన 21 పరుగులే అత్యధికం. పడిక్కల్ 15, కెప్టెన్ సంజు శాంసన్ 16, డరిల్ మిచెల్ 17 పరుగులు చేశారు. ఇక, ఈ మ్యాచ్‌తో పాయింట్ల పట్టికలో మార్పులేమీ చోటుచేసుకోలేదు. ఓడినప్పటికీ రాజస్థాన్ రాయల్స్ రెండో స్థానంలోనే ఉండగా, గెలిచిన ముంబై అట్టడుగునే ఉంది. ఐపీఎల్‌లో నేడు ఢిల్లీ కేపిటల్స్-లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.


More Telugu News