తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌పై జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ఆగ్ర‌హం

  • సీఎం, హైకోర్టు సీజే ఆదేశాల‌ను అమ‌లు చేయ‌ట్లేదు
  • కీల‌క నిర్ణ‌యాల‌న్నీ పెండింగ్‌లోనేన‌న్న జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌
  • ఈ అంశాన్ని ప‌రిశీలిస్తామ‌న్న తెలంగాణ మంత్రి ఇంద్ర‌క‌రణ్ రెడ్డి
భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జస్టిస్ ఎన్వీ ర‌మ‌ణ శ‌నివారం నాడు తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, హైకోర్టు సీజే జారీ చేసిన ఆదేశాల‌ను సోమేశ్ కుమార్ అమ‌లు చేయ‌డం లేద‌ని జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ఆరోపించారు. తెలంగాణ ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌తో పాటు హైకోర్టు జారీ చేసిన ఆదేశాల‌ను అమ‌లు చేయ‌కుండా సోమేశ్ కుమార్ పెండింగ్‌లో పెడుతున్నార‌ని మండిప‌డ్డారు. న్యాయ వ్య‌వ‌స్థ బ‌లోపేతం కోసం నిర్ణ‌యాలు తీసుకుంటున్నామ‌న్న జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌.. వాటిని అమ‌లు చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల కోర్టుల్లో దుర్భ‌ర ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఢిల్లీలోని విజ్ఞాన్ భ‌వ‌న్‌లో శ‌నివారం ఉద‌యం ముఖ్య‌మంత్రులు, హైకోర్టు సీజేలతో మొద‌లైన స‌ద‌స్సులోనే జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ఈ వ్యాఖ్య‌లు చేశారు. అయితే ఈ స‌మావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజ‌రు కాలేదు. త‌న త‌ర‌ఫున మంత్రి అల్లోల ఇంద్ర‌కర‌ణ్ రెడ్డిని ఢిల్లీకి పంపారు. స‌మావేశంలో తెలంగాణ సీఎస్‌ను ప్ర‌స్తావిస్తూ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ చేసిన వ్యాఖ్య‌ల‌ను నోట్ చేసుకున్నామ‌ని, వాటిపై ప‌రిశీల‌న చేస్తామ‌ని ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు.


More Telugu News