రష్యా నుంచి భారత్ కంటే అధికంగా చమురు దిగుమతి చేసుకున్న దేశం... అమెరికా!

  • ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్ రష్యా దాడులు
  • తక్కువ ధరకే రష్యా నుంచి చమురు
  • భారీగా కొనుగోలు చేసిన భారత్
  • అంతకంటే అధికమొత్తంలో దిగుమతి చేసుకున్న అమెరికా 
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర చేపట్టాక అత్యంత ఆవేశపూరితంగా స్పందించిన దేశం అమెరికానే. ప్రపంచంలో మరే దేశం మరో దేశంపై విధించని అత్యంత కఠిన ఆంక్షలను రష్యాపై విధించింది. ఉక్రెయిన్ కు వెన్నుదన్నుగా నిలుస్తూ, రష్యాను నిలువరించడంలో జెలెన్ స్కీ సేనలకు తోడ్పాటు అందిస్తోంది. అయితే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఒకటి వెల్లడైంది. 

ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్యకు దిగినప్పటి నుంచి... రష్యా నుంచి అత్యధిక స్థాయిలో చమురు దిగుమతి చేసుకున్న దేశం భారత్ అని అందరూ భావించారు. రష్యాకు భారత్ చిరకాల మిత్రదేశం కాబట్టి, చమురు వాణిజ్యంపై యుద్ధ ప్రభావం పడలేదని అనుకోవచ్చు. కానీ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.... గత కొన్ని నెలల కాలంలో రష్యా నుంచి శిలాజ ఇంధనాన్ని భారత్ కంటే అమెరికానే అత్యధిక మొత్తంలో దిగుమతి చేసుకుందట. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్ఈఏ) సంస్థ ఈ విషయం వెల్లడించింది.

అయితే రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకున్న దేశాల జాబితాలో జర్మనీ అగ్రస్థానంలో నిలిచింది. మూడో స్థానంలో చైనా ఉండగా, ఇతర ఈయూ దేశాలు టాప్-10లో ఉన్నాయి. ఓ వైపు ఆంక్షలు ఉన్నప్పటికీ రష్యా ఇతర దేశాల అవసరాలను, తన వాణిజ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భారీగా ఎగుమతులు చేపట్టింది. ఒక్క ఇంధన రంగంలోనే 63 బిలియన్ యూరోల మేర చమురు ఎగుమతి చేసింది. తక్కువ ధరకు వస్తుండడంతో భారత్ భారీగానే రష్యా ముడిచమురు కొనుగోలు చేసినా, అమెరికా దిగుమతి చేసుకున్న మొత్తంతో పోల్చితే అది తక్కువే.


More Telugu News