నాలుగు కేటగిరీలుగా ఓబీసీ కులాలు... జస్టిస్ రోహిణి కమిషన్ సిఫారసులు

  • దేశంలో వేలాదిగా ఓబీసీ కులాలు
  • 27 శాతం రిజర్వేషన్ల కోసం తీవ్ర పోటీ
  • పరిశీలన కోసం 2017లో జస్టిస్ రోహిణి కమిషన్ ఏర్పాటు
  • సిఫారసులు సమర్పించిన కమిషన్ 
దేశంలో వేలాదిగా ఉన్న ఓబీసీ కులాలను 4 కేటగిరీలుగా విభజించాలని జస్టిస్ జి.రోహిణి కమిషన్ సిఫారసు చేసింది. భారత్ లో 2,633 ఓబీసీ కులాలు ఉండగా, వాటిని 1, 2, 3, 4 కేటగిరీలుగా విభజించాలని కమిషన్ సూచించింది. ఓబీసీ ఉప కులాల విషయంలో పరిశీలన కోసం కేంద్రం 2017లో జస్టిస్ జి.రోహిణి కమిషన్ ను నియమించింది. ఈ మేరకు విస్తృత అధ్యయనం జరిపిన కమిషన్ తన తుది నివేదికను కేంద్రానికి సమర్పించింది. కేటగిరి 1కు అత్యధికంగా 10 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కేంద్రానికి సూచించింది. 

ఈ నేపథ్యంలో కేంద్రం సున్నితమైన ఓబీసీ ఉపకులాలు, 27 శాతం రిజర్వేషన్ల సమాన పునర్విభజన అంశాలపై రాజకీయ పక్షాలతో చర్చలకు తెరలేపింది. కాగా, ఓబీసీ కులాల్లో ఇప్పటిదాకా ఉప వర్గీకరణ లేదు. వేల సంఖ్యలో ఉన్న ఓబీసీ కులాల మధ్య 27 శాతం రిజర్వేషన్ కోసం తీవ్ర పోటీ ఏర్పడిన పరిస్థితి ఉంది. 

అయితే, జస్టిస్ రోహిణి కమిషన్ నివేదిక, సిఫారసుల పట్ల కేంద్రం ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించుకుంది. ఓబీసీ కులాల రిజర్వేషన్ల విషయంలో తీసుకునే ఏ నిర్ణయం అయినా దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అందుకే మొదట దీనిపై రాజకీయ పక్షాల అభిప్రాయాలు స్వీకరించాలని భావిస్తోంది.


More Telugu News