కరోనా నష్టం నుంచి కోలుకోవడానికి 12 ఏళ్లు..: ఆర్బీఐ నివేదిక
- రూ.52 లక్షల కోట్ల మేర ఉత్పత్తి నష్టం
- ఉక్రెయిన్-రష్యా సంక్షోభం, అధిక కమోడిటీ ధరలు
- అంతర్జాతీయంగా సరఫరా సమస్యలు
- 2034-35 నాటికి నష్టాల నుంచి బయటకు
- ఆర్బీఐ నివేదిక ఒకటి అంచనా
కరోనా మహమ్మారి చేసిన నష్టాల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకోవడానికి పదేళ్లకు పైగా సమయం పడుతుందని ఆర్బీఐ నివేదిక ఒకటి తెలిపింది. కరోనా మహమ్మారి సమయంలో రూ.52 లక్షల కోట్ల మేర ఉత్పత్తికి నష్టం కలిగినట్టు అంచనా వేసింది. విడిగా చూస్తే 2020-21లో రూ.19.1 లక్షల కోట్లు, 2021-22లో రూ.16.4 లక్షల కోట్లు, 2022-23లో రూ. 16.4 లక్షల కోట్ల చొప్పున ఉంటుందని తెలిపింది.
కోలుకుంటున్న దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా రెండో విడత గట్టి ప్రభావం చూపించినట్టు వివరించింది. ఒమిక్రాన్ రూపంలో మూడో విడత వైరస్ సైతం కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థపై స్వల్ప ప్రభావానికి దారితీసినట్టు పేర్కొంది. స్వల్పకాలంలో ఉక్రెయిన్-రష్యా యుద్ధ సంక్షోభం, కమోడిటీ ధరలు పెరిగిపోవడం, అంతర్జాతీయ సరఫరా సమస్యలు, అంతర్జాతీయ దేశీయ వృద్ధికి ప్రతికూలతలుగా పేర్కొంది.
మధ్యకాలానికి దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి తీరు వేగాన్ని అందుకుంటుందని ఆర్బీఐ నివేదిక అంచనా వేసింది. ‘‘2020-21లో వాస్తవ వృద్ధి రేటు మైనస్ 6.6 శాతం. 2021-22లో 8.9 శాతం. 2022-23లో 7.2 శాతం. ఆ తర్వాత 7.5 శాతం స్థాయిలో కొనసాగుతుంది. ఈ ప్రకారం భారత్ 2034-35 నాటికి కొవిడ్ నష్టాల నుంచి పూర్తిగా బయట పడుతుంది’’అని ఆర్బీఐ నివేదిక వివరించింది.