టాటా నుంచి కాన్సెప్ట్ ఈవీ ‘అవిన్య’.. చూస్తే కళ్లు తిప్పుకోలేరు!

  • నిన్న లాంఛ్ చేసిన టాటా గ్రూప్
  • 30 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్
  • ఒక్కసారి చార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల జర్నీ
ఇప్పుడు విద్యుత్ వాహనాల కాలం నడుస్తోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, విపరీతమైన కాలుష్యంతో పర్యావరణ మార్పులు వంటి వాటితో సంప్రదాయ వాహనాల నుంచి ఈవీలకు మళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయి. అయితే, విదేశాల్లో ఇప్పటికే ఈవీలు పాప్యులర్ అయినా.. మన దేశంలో మాత్రం ఇప్పుడిప్పుడే జనాలు వాటివైపు చూస్తున్నారు. 

టాటా కూడా నెక్సాన్ పేరిట ఓ ఈవీని మార్కెట్ లోకి తీసుకొచ్చింది. అయితే, తాజాగా ఈవీలో ఓ కాన్సెప్ట్ కు సంస్థ శ్రీకారం చుట్టింది. శుక్రవారం ఆ కారు నమూనాను ఆవిష్కరించింది. కారుకు ‘అవిన్య’ అనే పేరును పెట్టింది. అవిన్య అంటే సంస్కృత భాషలో ‘ఆవిష్కరణ’ అని అర్థం. డ్రైవింగ్ చేసేటప్పుడు మధురానుభూతులను పొందేందుకు, డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ వచ్చేందుకు కొత్త తరం సాంకేతిక, సాఫ్ట్ వేర్, కృత్రిమ మేధను ఇందులో పొందుపరిచినట్టు టాటా సంస్థ వెల్లడించింది. 

మూడో తరం నిర్మాణ సాంకేతికతతో అవిన్యకు టాటా రూపునిచ్చింది. ప్రపంచంలోని అత్యున్నతమైన కాన్సెప్ట్ కార్లన్నింటినీ నూరి వడగొట్టి రూపొందించినట్టు.. అవిన్య వరల్డ్ క్లాస్ ప్రమాణాలతో రూపుదిద్దుకుంది. కారుకు బటర్ ఫ్లై డోర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇంటీరియర్ ను చాలా అందంగా తీర్చిదిద్దారు. రోడ్డు నుంచి దృష్టి మళ్లించే వాటిని ఇంటీరియర్ లో తప్పించారు. అంతేగాకుండా డ్రైవర్ మీద ఒత్తిడి పడకుండా ఉండే వాతావరణాన్ని కల్పించారు. 

కొత్త తరం సామగ్రిని ఉపయోగించి కారును నిర్మించడం విశేషం. సమర్థవంతమైన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ తో అవిన్యకు రూపకల్పన చేశారు. అత్యంత తేలికైన మెటీరియల్ నూ వాడడం కారుకున్న మరో ప్రత్యేకత. కాగా, దీని ఫాస్ట్ చార్జింగ్ టెక్నిక్ తో అరగంటలోనే బ్యాటరీ చార్జ్ అవుతుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చు. ‘మినిమైజ్– మ్యాగ్జిమైజ్–ఆప్టిమైజ్’ అనే సూత్రంతో రేంజ్ ను పెంచారు. అయితే, కారును సొంతం చేసుకోవాలనుకుంటే మాత్రం 2025 దాకా వేచి చూడాల్సిందే.


More Telugu News