అటువంటి దృశ్యాల‌ను సినిమాల్లో తప్ప ఎక్క‌డా చూడలేదు: ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ

  • యుద్ధం ప్రారంభ‌మైన రోజు ఉద‌యాన్నే బాంబుల మోత విన‌ప‌డింద‌న్న జెలెన్‌స్కీ
  • తాను, త‌న‌ భార్య ఒలెనా, పిల్ల‌లు నిద్రలేచామ‌ని వ్యాఖ్య‌
  • అధ్యక్ష భవనం నుంచి బయటకు చూశాన‌ని వివ‌ర‌ణ‌
  • బాంబుల మోత‌తో ఆ ప్రాంతం అంతా దద్ద‌రిల్లిపోయింద‌ని వెల్ల‌డి
ఉక్రెయిన్‌-ర‌ష్యా మ‌ధ్య‌ యుద్ధం కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ... యుద్ధం ప్రారంభ‌మైన మొద‌టి రోజు గురించి మాట్లాడారు. ఆ రోజు ఉదయం రష్యా బలగాలు దుశ్చర్యను ప్రారంభించాయ‌ని చెప్పారు. ఉద‌యాన్నే బాంబుల మోత విన‌ప‌డింద‌ని, తాను, త‌న‌ భార్య ఒలెనా, పిల్ల‌లు నిద్రలేచామ‌ని అన్నారు. 

వెంటనే కొంద‌రు అధికారులు త‌మ వ‌ద్ద‌కు వచ్చారని, త‌మ‌ కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని చెప్పారని ఆయ‌న తెలిపారు. రష్యా బలగాలు కుటుంబంతో పాటు తనను చంపే అవకాశాలు ఉన్నాయని అధికారులు త‌నకు చెప్పార‌ని జెలెన్ స్కీ వివ‌రించారు. ఆ స‌మ‌యంలో తాను అధ్యక్ష భవనం నుంచి బయటకు చూశాన‌ని, బాంబుల మోత‌తో ఆ ప్రాంతం అంతా దద్ద‌రిల్లిపోయింద‌ని చెప్పారు. 

అటువంటి దృశ్యాల‌ను తాను సినిమాల్లో తప్ప ఎక్క‌డా చూడలేదని అన్నారు. త‌మ‌ అధ్యక్ష భవనం గేటు ముందు భారీగా సిబ్బంది మోహరించారని అన్నారు. ఆ  రోజు రాత్రంతా అధ్యక్ష భవనం ప్రాంగణంలో అధికారులు లైట్లు ఆర్పేశారని, త‌న‌కు, త‌న సిబ్బందికి బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు ఇచ్చార‌ని తెలిపారు. ఏ జరుగుతుందో అనే ఆందోళనతో అంద‌రూ ఉన్నారని, వారికి తానే ధైర్యం చెప్పాన‌ని అన్నారు. 



More Telugu News