టెన్నిస్ దిగ్గజం బోరిస్ బెకర్ కు జైలు శిక్ష విధించిన లండన్ కోర్టు
- 2017లో దివాళా తీసినట్టు ప్రకటించిన బెకర్
- ఆ తర్వాత తన ఖాతా నుంచి లక్షలాది పౌండ్లను ట్రాన్స్ ఫర్ చేసిన వైనం
- తన కెరీర్లో 6 సార్లు గ్రాండ్ స్లామ్ విజేతగా నిలిచిన బెకర్
అంతర్జాతీయ టెన్నిస్ దిగ్గజాలలో ఒకడిగా పేరుగాంచిన జర్మన్ ఛాంపియన్ బోరిస్ బెకర్ కు లండన్ లోని ఒక కోర్టు జైలు శిక్షను విధించింది. లక్షలాది పౌండ్లను దాచిపెట్టి, దివాలా తీసినట్టు ప్రకటించిన కేసులో రెండున్నరేళ్ల జైలు శిక్షను విధించింది. ఈ నెల ప్రారంభంలోనే బెకర్ ను కోర్టు దోషిగా నిర్ధారించింది. ఇప్పుడు శిక్షను విధించింది.
తాను దివాలా తీసినట్టు 2017లో బెకర్ ప్రకటించాడు. ఆ తర్వాత తన మాజీ భార్య బార్బరా, తనకు దూరంగా ఉంటున్న భార్య షర్లీ సహా ఇతర ఖాతాలకు తన వ్యాపార ఖాతా నుంచి లక్షల పౌండ్లను ట్రాన్స్ ఫర్ చేశాడు. ఈ క్రమంలో ఆయనపై కేసులు నమోదయ్యాయి. తన ఆస్తిని, టెక్ సంస్థల్లో షేర్లను దాచినందుకు కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించింది. 54 ఏళ్ల బెకర్ తన కెరీర్లో ఆరు సార్లు గ్రాండ్ స్లామ్ విజేతగా నిలిచాడు. ప్రపంచ నెంబర్ వన్ గా కొనసాగాడు.