వేలిముద్రలు, ఐరిస్​ వంటి బయోమెట్రిక్​ లేకుండానే ‘బ్లూ ఆధార్​’.. ఎవరికిస్తారో తెలుసా?

  • ఐదేళ్ల లోపు పిల్లలకు జారీ
  • దానికే బాల ఆధార్ అనీ పేరు
  • ఐదేళ్లు నిండాక బయోమెట్రిక్ తప్పనిసరి
ఆధార్.. దేశంలోని ప్రతి ఒక్కరి గుర్తింపు పత్రమిది. సంక్షేమ ఫలాలు అందాలన్నా.. లోన్ రావాలన్నా.. బ్యాంకుల్లో ఖాతా ఓపెన్ చేయాలన్నా.. చివరికి ప్యాన్ కావాలన్నా.. ఏది కావాలన్నా ఆధార్ ఎంత ఆధారమో తెలిసిందే. దాని మీదుండే పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి సమస్త వివరాలే మన ఐడెంటిటీకి కీలకం. అయితే, ఇందులో ‘బ్లూ ఆధార్’ అనేది ఇంకోటి ఉందన్న విషయం తెలుసా? అది ఎవరికిస్తారో తెలుసా? 

ఇప్పటిదాకా పెద్దల కోసం కేవలం తెలుపు రంగు కార్డులనే ఇస్తోంది ఆధార్ ను జారీ చేసే ప్రాధికార సంస్థ యూఐడీఏఐ (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా). అయితే, పిల్లల కోసమూ ప్రత్యేకంగా ఓ ఆధార్ ను ఇటీవలే తీసుకొచ్చింది. ఆ కార్డును నీలం రంగులో జారీ చేస్తోంది. అందుకే దానిని ‘బ్లూ ఆధార్’ అని పిలుస్తున్నారు. ఐదేళ్ల లోపుండే పిల్లల కోసం స్పెషల్ గా తెచ్చిన ఆధార్ ఇది. అందుకే దీనిని ‘బాల ఆధార్’ అనీ అంటారు. 

మామూలుగా అయితే ఆధార్ కోసం పెద్దల నుంచి వేలి ముద్రలు, ఐరిస్ వంటి వివరాలను బయోమెట్రిక్ ద్వారా తీసుకోవడం తెలిసిందే. అయితే, ఈ బ్లూ ఆధార్ కోసం పిల్లల నుంచి అవేవీ తీసుకోరు. కేవలం పేరు, తల్లిదండ్రుల పేరు, చిరునామా వంటి వాటితో నమోదు చేస్తారు. పిల్లలకు ఐదేళ్లు దాటిన తర్వాత బయోమెట్రిక్ వివరాలను అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. 15 ఏళ్లు నిండిన తర్వాత మరోసారి వివరాలను అప్ డేట్ చేసుకోవాలి. లేదంటే పాతవి చెల్లుబాటు కావు. 

ఇక, బాల ఆధార్ కోసం తల్లిదండ్రులు.. పిల్లల జనన ధ్రువీకరణ పత్రం లేదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కార్డులను ప్రూఫులుగా అందజేస్తే చాలు. స్కూలు ఐడీనీ వినియోగించవచ్చు. కాగా, ఆధార్ కేంద్రంలో వివరాలను నమోదు చేశాక.. ఎక్ నాలెడ్జ్ మెంట్ కార్డును తీసుకోవడం ఎట్టిపరిస్థితుల్లో మరిచిపోవద్దు. ఎందుకంటే.. పిల్లల ఆధార్ కు దరఖాస్తు చేసుకున్న 60 రోజుల లోపు ఎప్పుడైనా కార్డును జారీ చేస్తారు. 


More Telugu News