ఆదివాసీల తాగునీటి కష్టాలు చూస్తే బాధేస్తోంది... చేతకాని ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెబుతుంది?: చంద్రబాబు

  • రంపచోడవరం మండలం చిలక మామిడిలో తాగు నీటి స‌మ‌స్య‌
  • వాట‌ర్ ట్యాంకు ఉన్నా... పాడైపోయిన నీటిని పంప్ చేసే మోటార్లు 
  • రిపేర్లు చేయించేందుకు పంచాయ‌తీలో లేని నిధులు
  • గిరిజ‌నులు కొండ వాగు చెంత చెలమ నీటినే తాగుతున్నారన్న చంద్ర‌బాబు
  • ఇలాగైతే ఆదివాసీల ఆరోగ్య ప‌రిస్థితి ఏమిట‌ని ప్ర‌శ్నించిన వైనం
గిరిజ‌న గూడేల్లో ఆదివాసీలు తాగు నీటి కోసం నానా అవస్థ‌లు ప‌డుతున్న వైనాన్ని ప్ర‌స్తావిస్తూ టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు శుక్ర‌వారం నాడు ట్వీట్‌ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం చిలక మామిడి గ్రామంలో వాట‌ర్ ట్యాంకు ఉన్నా.. దానిలోకి నీటిని పంప్ చేసే మోటార్లు పాడైపోయాయ‌ని తెలిపారు. ఈ మోటార్ల‌ను రిపేర్ చేయించేందుకు పంచాయ‌తీలో నిధులు లేవ‌ని కూడా చంద్ర‌బాబు పేర్కొన్నారు.

సుమారు 150 ఆదివాసీ కుటుంబాలు ఉండే ఆ గ్రామంలో సొంత డ‌బ్బు పెట్టి మోటార్లు రిపేర్ చేయించుకునే స్తోమ‌త వారికి లేద‌ని చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మోటార్ల రిపేర్‌కు అవ‌కాశం లేని నేప‌థ్యంలో ఆదివాసీలు కొండ వాగు చెంత చెలమ నీటినే తాగుతున్నారన్న చంద్ర‌బాబు.. ఇలా అయితే వారి ఆరోగ్య పరిస్థితి ఏమిట‌ని ప్ర‌శ్నించారు. ప్రజలకు సురక్షిత తాగునీటిని ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం దీనికి ఏమి సమాధానం చెబుతుంద‌ని చంద్ర‌బాబు నిల‌దీశారు.


More Telugu News