అన్నీ తప్పే.. అందరిదీ తప్పే.. ‘నో బాల్’ వ్యవహారంపై రికీ పాంటింగ్

  • అంపైరింగ్ తప్పు.. వాళ్ల నిర్ణయాలు తప్పు
  • ఆవేశంలో పంత్ తీరు తప్పు
  • మైదానంలోకి సహాయ కోచ్ వెళ్లడమూ తప్పే
  • వాటన్నింటినీ మరచి ముందుకెళ్లాలని కామెంట్
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్, బౌలర్ శార్దూల్ ఠాకూర్, సహాయ కోచ్ ఆమ్రే నోబాల్ వ్యవహారంపై.. ఆ జట్టు ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ ఎట్టకేలకు స్పందించాడు. నిన్న కోల్ కతా నైట్ రైడర్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించిన అనంతరం అతను మాట్లాడాడు. ఈ సందర్భంగానే అంతకుముందు రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో నో బాల్ వ్యవహారంపై స్పందించాడు. 

ఆ మ్యాచ్ లో బంతి నడుము ఎత్తులో వచ్చినా అంపైర్ నో బాల్ ఇవ్వకపోవడంతో పంత్ తో పాటు టీం సభ్యులు.. క్రీజులో ఉన్న రోవ్ మన్ పావెల్ తో పాటు నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న బ్యాటర్ ను వెనక్కు వచ్చేయమన్న సంగతి తెలిసిందే. అదికాస్తా వివాదాన్ని రాజేసింది. దీనిపై మాట్లాడిన పాంటింగ్.. అందరిదీ తప్పేనని వ్యాఖ్యానించాడు. 

‘‘చూడండి.. అదంతా తప్పే. ఆ వ్యవహారంలో జరిగినవన్నీ తప్పే. అంపైరింగ్ తప్పు.. వాళ్లు తీసుకున్న నిర్ణయం తప్పు. కానీ, దాన్ని వదిలేసి ముందుకెళ్లిపోవాలి. కానీ, మా జట్టుకు చెందిన నలుగురు ఆటగాళ్లు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. నిరసన తెలిపారు. మా సహాయ కోచ్ మైదానంలోకి వెళ్లిపోయారు. ఆ రోజు జరిగిన దానికి మా వాళ్లెవరూ ఆనందంగా లేరు. నేను.. జట్టు ఆటగాళ్లతో మాట్లాడాను. రెండు వారాలుగా మేం కొంచెం కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. రెండు కరోనా కేసులు వచ్చాయి. దీంతో హోటల్ గదిలోనే మగ్గిపోయాం’’ అని అన్నాడు. 

ఆ రోజు జరిగిన వ్యవహారంతో కొంత ఫ్రస్ట్రేషన్ కలిగిందని, వాటన్నింటినీ మరచిపోయి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పాడు. ఇప్పుడు మిగతా సగం టోర్నమెంట్ పైనే దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నాడు.


More Telugu News