ఇద్దరు మిత్రుల ‘ఐపీఎల్ టైటిల్’ వేట.. పంజాబ్, లక్నో జట్ల మధ్య కీలక మ్యాచ్

  • రెండు జట్ల కెప్టెన్లు గతంలో పంజాబ్ ఓపెనర్లు
  • అండర్ 13 నుంచే కర్ణాటక జట్టు సహచరులు
  • ఇద్దరి మధ్య మంచి స్నేహం
  • కానీ ఆటలో ప్రత్యర్థులే
  • గెలుపు కోసం పోటా పోటీ
నేడు లక్నోసూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య పుణెలోని ఎంసీఏ స్టేడియంలో కీలక మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో లక్నో జట్టు నాలుగో స్థానంలో ఉండగా.. పంజాబ్ కింగ్స్ కింది నుంచి నాలుగో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాలంటే ఇక నుంచి అన్ని జట్లు సమష్టిగా కృషి చేయాల్సిందే. 

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్, లక్నో జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇద్దరూ ఎప్పటి నుంచో మిత్రులు. లక్నో జట్టు కెప్టెన్ బాధ్యతలకు ముందు రాహుల్ పంజాబ్ కింగ్స్ కు సారథ్యం వహించడం తెలిసిందే. ఆ సమయంలో రాహుల్, మయాంక్ అగర్వాల్ ఓపెనర్లుగా పనిచేశారు. ఎంతో విజయవంతమైన ఓపెనర్ల భాగస్వామ్యంగా వీరికి పేరుంది. ఐదు సెంచరీల భాగస్వామ్యం వీరి పేరిట ఉంది.

అండర్ 13 స్థాయి నుంచి కర్ణాటక జట్టులో వీరు ఇద్దరు కలసి ఆడినవారే. అందుకే వీరి స్నేహం ప్రత్యేకమైనది. కానీ, ప్రత్యర్థులుగా ఐపీఎల్ లో తలపడక తప్పదు. అందుకే రెండు జట్ల మధ్య మ్యాచ్ రసవత్తరంగా ఉండనుంది. పంజాబ్ కింగ్స్ మిడిలార్డర్ సమస్యలను ఎదుర్కొంటోంది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ కూడా బ్యాటింగ్ తో రాణించడం లేదు. శిఖర్ ధావన్ మీదే ఆధారపడాల్సి వస్తోంది. మరోవైపు లక్నో జట్టు కెప్టెన్ రాహుల్ నిలకడగా రాణిస్తున్నాడు. బ్యాటింగ్ పరమైన సమస్యలు లక్నో జట్టుకు సైతం ఉన్నాయి. కనుక మెరుగైన ప్రదర్శనతో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.


More Telugu News