సుంద‌ర‌నాయుడు మృతికి చంద్ర‌బాబు సంతాపం

  • అనారోగ్యంతో క‌న్నుమూసిన సుంద‌ర‌నాయుడు
  • సుంద‌ర‌నాయుడి మ‌ర‌ణం విచార‌క‌ర‌మ‌న్న చంద్ర‌బాబు
  • వేల మందికి ఉపాధి క‌ల్పించిన గొప్ప వ్య‌క్తిగా అభివ‌ర్ణ‌న‌
ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త‌, బాలాజీ హ్యాచ‌రీస్ వ్య‌వ‌స్థాప‌కుడు ఉప్ప‌ల‌పాటి సుంద‌ర‌నాయుడి మృతి ప‌ట్ల టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు సంతాపం ప్ర‌క‌టించారు. చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరుకే చెందిన సుంద‌ర‌నాయుడు... అనారోగ్య కార‌ణాల‌తో గురువారం సాయంత్రం హైద‌రాబాద్‌లోని ఓ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన సంగ‌తి తెలిసిందే. సుంద‌ర‌నాయుడు మ‌ర‌ణించార‌న్న వార్త తెలియ‌గానే చంద్ర‌బాబు ఆయ‌న మృతికి సంతాపం తెలుపుతూ ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు.

"ప్రముఖ పారిశ్రామికవేత్త, బాలాజీ హ్యాచరీస్‌ అధినేత ఉప్పలపాటి సుందరనాయుడు గారి మరణం విచారకరం. రైతుల ఆర్థిక సమస్యలకు పరిష్కారంగా కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహించి, బాలాజీ హ్యాచరీస్‌ స్థాపనతో పౌల్ట్రీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టి, వేల మందికి ఆయన ఉపాధిని ఇచ్చారు. సుందరనాయుడు గారి మరణం పౌల్ట్రీ రంగానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని ఆ ప్ర‌క‌ట‌న‌లో చంద్ర‌బాబు సంతాపం ప్ర‌క‌టించారు.


More Telugu News