సీనియర్ నటుడు సలీమ్ గౌస్ కన్నుమూత

  • ఈ వేకువ జామున గుండెపోటుతో మృతి
  • గత రాత్రి నుంచి ఛాతీలో నొప్పితో బాధపడిన గౌస్
  • కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
  • గతంలో తెలుగు సినిమాల్లోనూ నటించిన సలీమ్ గౌస్
హిందీ, తమిళం, తెలుగు తదితర భాషల్లో అనేక చిత్రాల్లో నటించిన సీనియర్ నటుడు సలీమ్ గౌస్ కన్నుమూశారు. ఆయన వయసు 70 ఏళ్లు. సలీమ్ గౌస్ ముంబయిలో ఈ వేకువజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని ఆయన భార్య అనితా గౌస్ వెల్లడించారు. ఆయన గతరాత్రి నుంచే ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పారని, దాంతో ఆయనను కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించామని వివరించారు. చికిత్స పొందుతూ మరణించాడని వెల్లడించారు. 

కాగా, సలీమ్ గౌస్ తెలుగులోనూ పలు చిత్రాల్లో ప్రతినాయక ఛాయలున్న పాత్రలు పోషించారు. నాగార్జున నటించిన అంతం, రక్షణ, చిరంజీవి ముగ్గురు మొనగాళ్లు చిత్రంలోనూ సలీమ్ గౌస్ నటించారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన తిరుడా తిరుడా (తెలుగులో దొంగ దొంగ) చిత్రంలోనూ ఆయన తన నటనా ప్రతిభను ప్రదర్శించారు. 

1952లో చెన్నైలో జన్మించిన సలీమ్ గౌస్ అక్కడే విద్యాభ్యాసం చేశారు. నటన పట్ల ఆసక్తితో పూణేలోని ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో పట్టా పుచ్చుకున్నారు. స్వర్గ్ నరక్ అనే చిత్రం ద్వారా 1978లో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. హిందీ, తమిళం, తెలుగు చిత్రాల్లోనే కాదు ది డిసీవర్స్, ది పర్ఫెక్ట్ మర్డర్ అనే ఆంగ్ల చిత్రాల్లోనూ నటించారు. ఆయన చివరిగా 2020లో కా అనే తమిళ చిత్రంలో నటించారు. 2010లో వెల్ డన్ అబ్బా అనే చిత్రంలో నటించగా, సుదీర్ఘ విరామం తర్వాత కా చిత్రంలో కెమెరా ముందుకు వచ్చారు. ఆ తర్వాత మళ్లీ నటించలేదు. 

సలీమ్ గౌస్ బుల్లితెర రంగంలోనూ నటుడిగా రాణించారు. నాడు దూరదర్శన్ చానల్లో ప్రసారమైన భారత్ ఏక్ ఖోజ్ వంటి  అనేక ధారావాహికల్లో నటించారు. అంతేకాదు, హాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రం 300 మూవీలో కింగ్ లియొనైడాస్ పాత్రకు తమిళంలో డబ్బింగ్ చెప్పింది సలీమ్ గౌసే! 

కాగా, సలీమ్ గౌస్ గురించి ఆయన అర్ధాంగి అనితా గౌస్ వివరించారు. సలీమ్ గౌస్ ఒకరిపై ఆధారపడి బతకడాన్ని ఏమాత్రం ఇష్టపడేవారు కాదని, ఒకర్ని ప్రాధేయపడడం ఆయనకు నచ్చని విషయం అని వెల్లడించారు. చివరివరకు ఆత్మాభిమానంతో బతికారని తెలిపారు. ఆయన బహుముఖ ప్రజ్ఞావంతుడని, నటుడే కాకుండా మార్షల్ ఆర్ట్స్ యోధుడు, దర్శకుడు కూడా అని అనిత గౌస్ వెల్లడించారు. అంతేకాదు, కిచెన్ లోకి వచ్చి అనేక వంటకాలు చేసేవారని తెలిపారు. 

సీనియర్ నటుడు సలీమ్ గౌస్ మృతితో వివిధ చిత్ర పరిశ్రమల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేశారు.


More Telugu News