మహిళలపై ఘోరాలు జరుగుతుంటే సీబీఐ దత్తపుత్రుడు ఏం చేస్తున్నట్టు?: నాదెండ్ల మనోహర్

  • మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయన్న నాదెండ్ల
  • పాలకుల్లో చిత్తశుద్ధి లోపించిందని వ్యాఖ్య  
  • చేతగాని ప్రభుత్వం అంటూ విమర్శలు
  • శాంతిభద్రతలు గాలికొదిలేశారని కామెంట్  
  • పోలీసులను రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని ఆరోపణ
ఏపీలో ఇటీవల మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల పట్ల జనసేన పార్టీ అగ్రనేత నాదెండ్ల మనోహర్ ఆందోళన వ్యక్తం చేశారు. దిశ చట్టం చేశామని, గన్ కంటే ముందే జగన్ వస్తాడని చెప్పడం తప్ప రాష్ట్రంలో యువతులు, మహిళలకు వైసీపీ పాలకులు ఇసుమంతైనా రక్షణ ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో మాటలు తప్ప, చేతలు లేకపోవడం వల్లే దారుణాలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు.  

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో వివాహితపై సామూహిక అత్యాచారం, హత్య, కొల్లూరు మండలం చిలమూరులో పట్టపగలే మహిళ హత్య, విజయవాడలో మానసిక వికలాంగురాలిపై అత్యాచారం, తిరువూరులో ఇంటర్ విద్యార్థినిపై వాలంటీర్ భర్త వేధింపులు... ఇవి మరువకముందే గుంటూరు జిల్లాలో పలు ఘోరాలు చోటుచేసుకున్నాయని నాదెండ్ల మనోహర్ వివరించారు. ఇన్ని జరుగుతుంటే సీబీఐ దత్తపుత్రుడిలో చలనం లేదని విమర్శించారు. 

చట్టాలు చేశామని, యాప్ తీసుకువచ్చామని ప్రకటనలతో సరిపెట్టే చేతకాని ప్రభుత్వం కారణంగా ఆడబిడ్డల్లో ధైర్యం కలగడంలేదని పేర్కొన్నారు. సీఎం ఇంటికి సమీపంలో కృష్ణా నది ఒడ్డున గతేడాది జులైలో సామూహిక అత్యాచారం చోటుచేసుకుంటే ఇప్పటికీ ఓ నిందితుడ్ని పట్టుకోలేదని ఆరోపించారు. గుంటూరు జిల్లా మేడికొండూరులో సామూహిక అత్యాచారం జరిగితే పోలీసుల స్పందన, నిందితులను అదుపులోకి తీసుకోవడంలో జాప్యం చూస్తే ఈ వ్యవస్థను పాలకులు ఎలా గాడి తప్పించారో అర్థమవుతోందని విమర్శించారు. 

వైసీపీ సర్కారు పోలీసు శాఖను తమ రాజకీయ అవసరాలకు వాడుకుంటూ శాంతిభద్రతలను గాలికొదిలేసిందని మండిపడ్డారు. వైసీపీ ఫ్లెక్సీలు చిరిగిపోతే స్కూలు పిల్లలను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టే స్థాయికి ఆ శాఖను దిగజార్చిందని వివరించారు. ఏపీ పోలీసులకు జాతీయస్థాయిలో అవార్డులు వచ్చాయని చెప్పుకోవడం వల్ల ఏమిటి ప్రయోజనం? అని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కల్పించి, నిందితులకు కఠిన శిక్షలు పడేలా కేసులు నమోదు చేసినప్పుడే ఆ అవార్డులకు విలువ ఉంటుందని హితవు పలికారు.


More Telugu News