క‌రోనా ఆర్థిక సాయం నిధుల మ‌ళ్లింపు... ఏపీ స‌ర్కారుపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం

  • క‌రోనాతో మృతి చెందిన వారి కుటుంబాల‌కు ప‌రిహారం
  • అందుకోసం నిధుల‌ను కేటాయించిన ప్ర‌భుత్వం
  • అందులో నుంచి రూ.1,100 కోట్ల దారి మ‌ళ్లింపు
  • సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు
  • అఫిడ‌విట్ దాఖలు చేయాలంటూ సీఎస్‌కు నోటీసులు
ఏపీ ప్ర‌భుత్వంపై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు గురువారం నాడు తీవ్ర‌స్థాయిలో మండిప‌డింది. క‌రోనా సాయం నిధుల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించ‌డ‌మేమిట‌ని నిల‌దీసింది. క‌రోనా ప‌రిహారం నిధుల‌ను ఏపీ ప్ర‌భుత్వం దారి మ‌ళ్లించింద‌ని దాఖ‌లైన పిటిష‌న్‌పై గురువారం సుప్రీంకోర్టు విచార‌ణ చేప‌ట్టింది.

ఈ సంద‌ర్భంగా క‌రోనా ప‌రిహారం నిధుల‌ను దారి మ‌ళ్లించ‌డ‌మేమిట‌ని ప్ర‌భుత్వాన్ని కోర్టు ప్ర‌శ్నించింది. దీనిపై స‌మ‌గ్ర వివ‌రాల‌తో మే 13లోగా అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేర‌కు ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి నోటీసులు జారీ చేసింది. 

క‌రోనా కార‌ణంగా మృతి చెందిన వారి కుటుంబాల‌ను ఆదుకునేందుకు క‌రోనా ప‌రిహారం నిధుల‌ను కేటాయించిన ఏపీ ప్ర‌భుత్వం..అందులో ఏకం‌గా రూ.1,100 కోట్ల‌ను దారి మళ్లించింద‌ని ఓ వ్య‌క్తి సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. క‌రోనా నిధుల‌ను దారి మ‌ళ్లించిన ప్ర‌భుత్వంపై విచార‌ణ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు తీవ్రంగా మంద‌లించింది. వివ‌రాల‌తో అఫిడ‌విట్‌కు ఇదే చివ‌రి అవ‌కాశం అని కూడా కోర్టు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.


More Telugu News