అదే నేను కన్నడలో సమాధానం చెప్పి ఉంటే మీ పరిస్థితేంటి?: అజయ్ దేవగణ్ కు సుదీప్ కౌంటర్

  • తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారన్న సుదీప్ 
  • రెచ్చగొట్టేందుకు ఆ వ్యాఖ్యలు చేయలేదని వివరణ 
  • ఈ టాపిక్ ను ఇక్కడితో వదిలేయాలని విజ్ఞప్తి
అజయ్ దేవగణ్ వ్యాఖ్యలకు కన్నడ సూపర్ స్టార్ కిచ్చ సుదీప్ కౌంటర్ ఇచ్చాడు. ఇద్దరి మధ్యా ‘హిందీ’ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. హిందీ జాతీయ భాష కాదని సుదీప్.. అలాంటప్పుడు దక్షిణాది సినిమాలను హిందీలో ఎందుకు డబ్ చేస్తున్నారని అజయ్ దేవగణ్ మాటల వార్ కు తెరదీశారు. 

ఆ ట్వీట్ కు సుదీప్ మళ్లీ కౌంటర్ ఇచ్చాడు. తన ఉద్దేశమేంటో అర్థం కాలేదనుకుంటానంటూ ట్వీట్ చేశాడు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ చెప్పాడు. తాను దేని గురించి ఆ వ్యాఖ్యలు చేశానో వ్యక్తిగతంగా కలిసినప్పుడు చెప్తానంటూ పేర్కొన్నాడు. తాను ఎవరినీ కించపరిచేందుకుగానీ, రెచ్చగొట్టేందుకుగానీ.. చర్చ జరిగేందుకుగానీ ఆ కామెంట్లు చేయలేదని వ్యాఖ్యానించాడు. 

దేశంలోని ప్రతి భాషనూ తాను గౌరవిస్తానని చెప్పాడు. ఈ టాపిక్ ను ఇంతటితో వదిలేయాలని కోరారు. ‘‘మీరు హిందీలో పెట్టిన ట్వీట్ ను అర్థం చేసుకున్నాను కాబట్టే రిప్లై ఇవ్వగలిగాను. నేను హిందీ నేర్చుకున్నాను కాబట్టే అది సాధ్యమైంది. అదే నేను మీకు రిప్లైని కన్నడలో పెట్టి ఉంటే పరిస్థితి ఏంటి? మనం భారత్ కు చెందిన వాళ్లం కాదా సార్?’’ అంటూ అజయ్ కు సుదీప్ కౌంటర్ ఇచ్చాడు. 

కాగా, సుదీప్ ట్వీట్ కు అజయ్ దేవ్ గణ్ కూడా మళ్లీ రిప్లై ఇచ్చాడు. ‘‘నువ్వు.. నా స్నేహితుడివి’’ అన్నాడు. అపార్థాలను తొలగించినందుకు కృతజ్ఞతలు అని చెప్పాడు. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటేనని తాను నమ్ముతానన్నాడు. అన్ని భాషలనూ పరస్పరం గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. అనువాదంలో ఏదో తప్పు దొర్లి ఉంటుందని పేర్కొన్నాడు. 

ఆ ట్వీట్ కు స్పందించిన సుదీప్.. అనువాదాలు, అర్థం చేసుకోవడాలు కేవలం మన ఆలోచనలేనని అన్నాడు. తాను ఎవరినీ బ్లేమ్ చేయదలచుకోలేదని, అన్ని విషయాలు తెలుసుకున్నాకే తాను స్పందిస్తానని చెప్పుకొచ్చాడు. ‘‘మీ నుంచి నాకు ట్వీట్ రావడం నాకు చాలా ఆనందకరమైన విషయం’’ అని రాసుకొచ్చాడు.


More Telugu News