అజయ్ దేవగణ్​ వర్సెస్ సుదీప్.. మధ్యలో దూరిన రామ్ గోపాల్ వర్మ.. ఏమన్నారంటే..!

  • హిందీపై ఇద్దరు స్టార్ల మధ్య మాటల యుద్ధం
  • దక్షిణాది స్టార్లపై బాలీవుడ్ స్టార్లకు అసూయ అంటూ వర్మ కామెంట్
  • భాష ప్రజలను కలపాలేగానీ విడదీయ కూడదంటూ వ్యాఖ్య
హిందీ జాతీయ భాషా? కాదా? 
ఇప్పుడు కిచ్చ సుదీప్, అజయ్ దేవగణ్ మధ్య జరుగుతున్న హాట్ హాట్ చర్చ ఇదే. మధ్యలోకి రాజకీయాలూ వచ్చేశాయ్. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దీనిపై స్పందించారు కూడా. 

తాజాగా మధ్యలో రామ్ గోపాల్ వర్మ దూరిపోయారు. బాలీవుడ్ అగ్రతారలను మాటలతో ఆడేసుకున్నారు. హిందీలో దక్షిణాది చిత్రాలు మంచి వసూళ్లతో దూసుకెళ్తుండడంతో బాలీవుడ్ స్టార్ హీరోలకు అసూయ పెరిగిపోతోందని అన్నారు. దక్షిణాది..ఉత్తరాది కాదని, భారతదేశం మొత్తం ఒక్కటనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ట్వీట్ చేశారు.

‘‘ప్రాంతీయత, అక్కడి సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా భాషలు వృద్ధి చెందాయి. భాష.. ప్రజలు దగ్గరయ్యేందుకు ఉపయోగపడాలి కానీ.. విడదీసేందుకు కాదు’’ అని ట్వీట్ చేశారు. 

ఆ తర్వాత దక్షిణాది సినిమాలపై స్పందిస్తూ మరో ట్వీట్ వేశారు. ‘‘కేజీఎఫ్ 2 రూ.50 కోట్ల ఓపెనింగ్ వసూళ్లు సాధించడంతో ఉత్తరాది తారలు దక్షిణాది స్టార్స్ పై అసూయతో ఉన్నారన్నది నిజం. ఇకపై బాలీవుడ్ సినిమాల వసూళ్లు ఎలా ఉంటాయో చూద్దాం. బాలీవుడ్ లో బంగారం ఉందా? కన్నడలో బంగారం ఉందా? అనేది ‘రన్ వే 34’ కలెక్షన్లు చెప్పేస్తాయి’’ అని వర్మ ఘాటుగా రిప్లై ఇచ్చారు. 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల్ని అలరించేలా దక్షిణాది సినిమాలు ఉంటున్నాయని, హిందీ ఇక జాతీయ భాష కాదని ఓ సినిమా ఆడియో ఫంక్షన్ లో సుదీప్ అన్నాడు. అంతేకాదు.. హిందీ వాళ్లే పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారని, తమిళం, తెలుగు, కన్నడలో సినిమాలను డబ్ చేస్తున్నా విజయాలను అందుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై అజయ్ దేవగణ్ మండిపడ్డారు. హిందీ జాతీయ భాష కానప్పుడు.. దక్షిణాది సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారని ప్రశ్నించారు.


More Telugu News