రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న రేపు జ‌రిగే కార్య‌క్ర‌మానికి నేను రాను: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

  • నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ బ‌లంగా ఉందన్న కోమ‌టిరెడ్డి
  • అటువంటి ప్రాంతంలో వేరే నేత సమీక్ష నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం లేదని వ్యాఖ్య‌
  • కాంగ్రెస్ పార్టీకి బ‌లం లేని ప్రాంతాల్లో సమావేశాలు పెట్టుకుంటే మంచిదని సూచ‌న‌
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న రేపు నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌ ఓ కార్యక్రమం నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. అయితే, ఆ కార్య‌క్ర‌మానికి తాను హాజరుకావడం లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ బ‌లంగా ఉందని, అటువంటి ప్రాంతంలో వేరే నేత సమీక్ష నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న అన్నారు. కాంగ్రెస్ పార్టీకి బ‌లం లేని ప్రాంతాల్లో సమావేశాలు పెట్టుకుంటే మంచిదని ఆయ‌న చెప్పారు. 

తన సొంత నియోజకవర్గంలో కేంద్ర మంత్రి గడ్కరీ నిర్వ‌హిస్తున్న‌ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయ‌ని, తాను హాజ‌రుకావాల్సి ఉంద‌ని చెప్పారు. త‌మ పార్టీలో గ్రూపు తగాదాలు సర్వ సాధారణమని, త‌న‌కు పార్టీ మారే ఉద్దేశం లేదని తెలిపారు. అయితే, వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇచ్చే అంశంపై త‌మ పార్టీ అధిష్ఠానం తీసుకున్న‌ నిర్ణ‌యాన్ని బ‌ట్టి కార్యాచరణ ప్రకటిస్తానని వ్యాఖ్యానించారు. 

ధరణి సమస్యలతో తెలంగాణ‌ రైతులు స‌మస్య‌లు ఎదుర్కొంటున్నార‌ని ఆయ‌న చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ధరణిని ఎత్తివేస్తామని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకుందామ‌ని అడిగినా ఏఐసీసీ హైకమాండ్ ఒప్పుకోలేదని ఆయ‌న చెప్పారు. 



More Telugu News