కేటీఆర్ కు పట్టాభిషేకం చేసేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారు: బండి సంజయ్

  • దళితుడిని సీఎం చేస్తామని చెప్పి మాట తప్పారన్న సంజయ్ 
  • టీఆర్ఎస్ ప్లీనరీలో బీజేపీని టార్గెట్ చేశారని విమర్శ  
  • రూ. 4 లక్షల కోట్ల అప్పులు ఉన్న తెలంగాణ ధనిక రాష్ట్రం ఎలా అవుతుందని ప్రశ్న 
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని టీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. రూ. 4 లక్షల కోట్ల అప్పులు ఉన్న తెలంగాణ ధనిక రాష్ట్రం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని అన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి... కేసీఆర్ కుటుంబం మాత్రం సంపాదించుకుందని విమర్శించారు. 

సాధారణంగా ఏ పార్టీ ప్లీనరీలో అయినా పార్టీ ఇచ్చే హామీలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చిస్తారని... కానీ టీఆర్ఎస్ ప్లీనరీలో మాత్రం కేవలం బీజేపీని టార్గెట్ చేశారని బండి సంజయ్ అన్నారు. బీజేపీ నేతలను అసభ్య పదజాలంతో దూషించారని విమర్శించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా చర్యలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా విమర్శిస్తారని అన్నారు. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించకుండా... కేంద్ర ప్రభుత్వం పైనే విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. 

టీఆర్ఎస్ పార్టీ ఆస్తులు వెయ్యి కోట్లు అని కేసీఆర్ చెప్పారని... మరి కేసీఆర్ ఆస్తులు ఎంతని ప్రశ్నించారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని... తన కొడుకుకి పట్టాభిషేకం చేసేందుకు యత్నిస్తున్నారని అన్నారు. దేశానికి కేన్సర్ లా మారిన ఎంఐఎంను కేసీఆర్ పక్కన పెట్టుకున్నారని విమర్శించారు. తాము చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.


More Telugu News