ఆంధ్రా నుంచి ఒడిశాకు కోడిగుడ్ల ఎగుమతులు.. ధరలు పడిపోతున్నాయంటూ ఒడిశా వ్యాపారుల రాస్తారోకో

  • ధరలు పడిపోతుండడంతో వ్యాపారులు నష్టపోతున్నారని ఆవేదన
  • మంగళ, బుధవారాల్లో రాస్తారోకో చేసిన వ్యాపారులు
  • రెండు కిలోమీటర్ల మేర నిలిచిపోయిన లారీలు
ఆంధ్రప్రదేశ్ నుంచి దిగుమతి అవుతున్న కోడిగుడ్ల వల్ల తమ రాష్ట్రంలో గుడ్ల ధరలు అమాంతం పడిపోతున్నాయంటూ ఒడిశాలోని పౌల్ట్రీ వ్యాపారులు రెండు రోజులపాటు రాస్తారోకోకు దిగారు. ఒడిశా పౌల్ట్రీ వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో మంగళ, బుధవారాల్లో ఖుర్దా ప్రాంతంలోని జాతీయ రహదారిపై బైఠాయించారు. ఫలితంగా ఏపీ నుంచి ఒడిశా, పశ్చిమబెంగాల్, మేఘాలయ రాష్ట్రాలకు కోడిగుడ్ల లోడుతో వెళ్తున్న లారీలు దాదాపు రెండు కిలోమీటర్ల మేర రహదారిపై నిలిచిపోయాయి.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మంగళవారం వ్యాపారులతో మాట్లాడి ఒప్పించడంతో రాస్తారోకో విరమించారు. అయితే, బుధవారం మరోమారు రాస్తారోకోకు దిగడంతో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు మానస్ మంగరాజు మాట్లాడుతూ.. ఏపీ నుంచి గుడ్లు దిగుమతి అవుతుండడంతో రాష్ట్రంలోని పౌల్ట్రీ వ్యాపారులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు బైఠాయిస్తామని తేల్చి చెప్పారు.


More Telugu News