ఆరేళ్ల క్రితం 'ఈజిప్ట్ ఎయిర్' విమాన ప్రమాదం.. వెలుగులోకి సంచలన విషయాలు

  • మే 2016లో జరిగిన ప్రమాదం
  • పారిస్ నుంచి కైరో వెళ్తూ మధ్యధరా సముుద్రంలో కూలిన విమానం
  • విమానంలో ఉన్న 66 మంది ప్రయాణికులూ మృతి
  • పైలట్ సిగరెట్ అంటించడమే కారణమని తేల్చిన దర్యాప్తు అధికారులు
ఆరేళ్ల క్రితం 66 మంది ప్రయాణికులతో వెళ్తూ సముద్రంలో కూలిన ఈజిప్ట్ ఎయిర్ విమాన ప్రమాదానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విమాన ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన ఫ్రెంచ్ ఏవియేషన్ నిపుణులు.. ప్రమాదానికి సిగరెట్ కారణమని తేల్చారు. పైలట్ సిగరెట్ అంటించడం వల్ల కాక్‌పిట్‌లో మంటలు చెలరేగాయని, ఫలితంగా విమానం కుప్పకూలిందని నిర్ధారించారు. దర్యాప్తునకు సంబంధించి 134 పేజీల నివేదికను పారిస్‌లోని అప్పీల్ కోర్టులో గత నెల సమర్పించారు. 

ఇందుకు సంబంధించిన వివరాలతో ‘న్యూయార్క్ పోస్ట్’ తాజాగా ఓ కథనాన్ని ప్రచురించడంతో ఈ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కాక్‌పిట్‌లో పైలట్ సిగరెట్ వెలిగించగానే అత్యవసర మాస్క్ నుంచి ఆక్సిజన్ లీకై కాక్‌పిట్‌లో మంటలు చెలరేగాయి. ఫలితంగా విమానం కుప్పకూలిందని దర్యాప్తు అధకారులు నివేదికలో పేర్కొన్నారు. కాక్‌పిట్‌లో మంటలు అంటుకున్న సమయంలో సిబ్బంది భయంతో అరుస్తున్న శబ్దాలు మాస్క్‌కు ఉన్న మైక్రోఫోన్‌లో రికార్డయ్యాయి.

ప్రమాదానికి గురైన ఈజిప్ట్ ఎయిర్ విమానయాన సంస్థకు చెందిన ఎయిర్‌బస్ ఎ320 మే 2016లో పారిస్‌ నుంచి ఈజిప్ట్ రాజధాని కైరోకు బయలుదేరింది. గ్రీక్ ద్వీపాలకు 130 నాటికల్ మైళ్ల దూరలో రాడార్ నుంచి విమానం అదృశ్యమైంది. ఆ తర్వాత కాసేపటికే క్రెటె ద్వీపం సమీపంలో తూర్పు మధ్యధరా సముద్రంలో కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో 66 మంది ప్రయాణికులు సహా 40 మంది ఈజిప్షియన్లు, 15 మంది ఫ్రాన్స్ జాతీయులు, ఇతర దేశాల వారు ఉండగా, వీరంతా ప్రాణాలు కోల్పోయారు.


More Telugu News