ఆంధ్రా- ఒడిశా బోర్డ‌ర్ వ‌ద్ద నిలిచిన 200 ఏపీ లారీలు... ఏమైందంటే..!

  • వేస‌వితో ప‌త‌న‌మైన కోడిగుడ్ల ధ‌ర‌లు
  • ఒడిశాలో ప‌రిస్థితి మ‌రింత దారుణం
  • ఏపీ కోడిగుడ్లు వ‌స్తే ధ‌ర‌లు మ‌రింత త‌గ్గుతాయంటున్న ఒడిశా రైతులు
  • సరిహ‌ద్దు వ‌ద్దే ఏపీ కోడిగుడ్ల లారీల అడ్డ‌గింత‌
  • బారులుగా నిలిచిపోయిన 200ల‌కు పైగా ఏపీ లారీలు
ఆంధ్రా- ఒడిశా స‌రిహ‌ద్దు వ‌ద్ద బుధ‌వారం హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఏపీ నుంచి కోడిగుడ్ల లోడుతో వెళుతున్న లారీల‌ను ఒడిశా రైతులు అడ్డుకున్నారు. ఏపీ కోడిగుడ్ల‌ను త‌మ రాష్ట్రంలోకి అనుమ‌తించేది లేదంటూ ఒడిశా రైతులు భీష్మించారు. ఫ‌లితంగా ఏపీ నుంచి కోడిగుడ్ల లోడుతో వెళుతున్న 200ల‌కు పైగా లారీలు అక్క‌డే బారులు క‌ట్టి నిలిచిపోయాయి. 

వేస‌వి నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా కోడిగుడ్ల ధ‌ర‌లు భారీగా ప‌త‌న‌మైన సంగ‌తి తెలిసిందే. ఒడిశాలో ఈ ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉంది. అదే స‌మ‌యంలో ఎప్ప‌టి మాదిరిగానే ఏపీ నుంచి కోడిగుడ్లు త‌మ రాష్ట్రంలోకి వ‌స్తే.. త‌మ కోడిగుడ్ల ధ‌ర మ‌రింత‌గా ప‌తన‌మ‌వుతుంద‌న్న‌ది ఒడిశా రైతుల వాద‌న‌. 

ఈ క్ర‌మంలోనే ఏపీ కోడిగుడ్ల‌ను త‌మ రాష్ట్రంలోకి అనుమ‌తించ‌కుంటే త‌మకు కాస్తంతైనా ఊరట ల‌భిస్తుంద‌ని ఒడిశా రైతులు భావిస్తున్నారు. ఈ కార‌ణంగానే స‌రిహ‌ద్దు వ‌ద్ద కాపు కాసిన ఒడిశా రైతులు ఏపీ కోడిగుడ్ల‌తో వ‌చ్చిన లారీల‌ను అక్క‌డే నిలిపేశారు. దీంతో అక్క‌డ వంద‌లాది వాహ‌నాలు అలాగే బారులు తీరి నిలిచిపోయాయి.


More Telugu News