ఏపీలో కలకలం.. పదో తరగతి పరీక్షల తొలి రోజే పేపర్ లీక్!

  • నంద్యాల జిల్లా అంకిరెడ్డిపల్లిలో తెలుగు పేపర్ లీక్
  • సోషల్ మీడియాలో క్వశ్చన్ పేపర్ ను అప్ లోడ్ చేసిన వైనం
  • ఇద్దరు అధికారుల సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. కరోనా వచ్చిన తర్వాత పరీక్షలు పక్కాగా జరుగుతుండటం ఇదే తొలిసారి. పరీక్షల నిర్వహణ కోసం ఏపీ విద్యా శాఖ అన్ని జాగ్రత్తలను తీసుకుంది. అయితే, పరీక్షల తొలి రోజే పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కావడం కలకలం రేపుతోంది. తొలుత చిత్తూరు జిల్లాలో ప్రశ్నాపత్రం లీక్ అయిందనే వార్తలు రాగా... ఆ జిల్లా కలెక్టర్ హరినారాయణ ఆ వార్తలను ఖండించారు. ఆ తర్వాత నంద్యాల జిల్లాలో పేపర్ లీక్ అయినట్టు వార్తలు వచ్చాయి. 

కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు లాంగ్వేజ్ పేపర్ లీక్ అయినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. వాచ్ మెన్ ద్వారా రూమ్ నెంబర్ 3 నుంచి క్వశ్చన్ పేపర్ లీక్ అయిందనే సమాచారం వైరల్ అయింది. ఈ క్రమంలో ఎంఈవో శ్రీధర్ రావు వెంటనే విచారణ చేపట్టారు. ఉన్నతాధికారులకు ఈ అంశం గురించి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పాఠశాల ఇన్విజిలేటర్, సూపర్ వైజర్ ను జిల్లా విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. 

మరోవైపు విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ మాట్లాడుతూ... పరీక్ష ప్రారంభమైన గంటన్నర తర్వాత ప్రశ్నాపత్రం బయటకు వచ్చిందని... దీన్ని లీక్ గా పరిగణించలేమని చెప్పారు. ఉదయం 9.30 గంటలకు పరీక్ష మొదలైందని... 11 గంటలకు పేపర్ లీక్ అయిందనే ప్రచారం జరిగిందని తెలిపారు. 11 గంటల సమయంలో ఎవరో పరీక్షా కేంద్రం నుంచి బయటకు వచ్చి క్వశ్చన్ పేపర్ ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి ఉంటారని అన్నారు. అంకిరెడ్డిపల్లిలో పేపర్ ను లీక్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.


More Telugu News