ఉత్పత్తి చెడ్డది అయితే సేల్స్ మ్యాన్ ఎవరైనా అది అమ్ముడు పోదు: కాంగ్రెస్, పీకేలపై బీజేపీ సెటైర్

  • వారసత్వ రాజకీయాలకు కాలం చెల్లిపోయిందన్న బీజేపీ 
  • దాన్ని విక్రయించినా అమ్ముడుపోదని వ్యాఖ్య 
  • రివార్ బచావో అనేదే కాంగ్రెస్ పార్టీ అజెండా అంటూ విమర్శ 
కాంగ్రెస్ పార్టీలో చేరనని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించడం పట్ల బీజేపీ స్పందించింది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను చేర్చుకోవాలన్న కాంగ్రెస్ ప్రయత్నం ఫలించని విషయాన్ని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనవాలా ప్రస్తావించారు.

‘‘ఉత్పత్తి చెడ్డది అయితే దాన్ని విక్రయించే వాడు మంచోడా, చెడ్డోడా అన్నది కాదు. ఆ ఉత్పత్తిని విక్రయించలేరు. గతంలోనే కాలం చెల్లిపోయిన వారసత్వ రాజకీయాలనే ఉత్పత్తిని విక్రయించలేరు.

పరివార్ బచావో (కుటుంబాన్ని కాపాడుకోవడం) అనేదే కాంగ్రెస్ పార్టీ అజెండా. పార్టీ బచావో (పార్టీని కాపాడు) కాదు. అందుకే పార్టీలో మార్పులు, నిర్మాణాత్మక సంస్కరణలపై పీకే ఇచ్చిన సూచనలతో కంగుతిన్నారు’’ అని పూనవాలా పేర్కొన్నారు. 

బీజేపీ మరో అధికార ప్రతినిధి గురు ప్రకాష్ పాశ్వాన్ సైతం స్పందిస్తూ.. పీకే సాధించిందేమిటి? అని ప్రశ్నించారు. మీడియానే పీకేను సెలబ్రిటీగా మార్చేసిందన్నారు. 

‘‘రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో వెండర్లను (విక్రేతలు) వినియోగించుకుంటాయి. ఆయన (పీకే) కూడా ఒక వెండరే. పంజాబ్, యూపీ, ఇతర ప్రదేశాల్లో అతడి ట్రాక్ రికార్డును చెక్ చేసుకోండి. ఇక్కడ ప్రశ్న ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపాన్ని ఎదుర్కొంటోందా? బయటి వ్యక్తులను నియమించుకోవాలని అనుకుంటోందా?’’ అని పాశ్వాన్ అన్నారు.


More Telugu News