ఒక్కసారిగా బరువు తగ్గుతుంటే.. కోలన్ కేన్సరేమో..పరీక్షించుకోవాలి.. లక్షణాలు ఇవీ..!

  • కడుపులో అసౌకర్యంగా ఉండడం
  • మల విసర్జన ఒకేసారి చేయలేకపోవడం
  • మలంలో రక్తం కనిపించడం కేన్సర్ లక్షణాలే
  • ముందే గుర్తించకపోతే ఇతర అవయాలకు వ్యాప్తి
జనార్దన్ వయసు 40 ఏళ్లు. ముగ్గురు పిల్లలు. తరచూ కడుపులో అసౌకర్యం, అలసట సమస్యలను ఎదుర్కొంటున్నాడు. బరువు చాలా తగ్గాడు. అయినా రోజులో ఎక్కువ సమయం పాటు కష్టపడే తత్వం అతడిది. దీంతో ఎక్కువ శ్రమ వల్లేనని అనుకున్నాడు. అప్పుడప్పుడు మలంలో రక్తం కనిపించేది. దాన్ని కూడా సీరియస్ గా తీసుకోలేదు. వైద్యులను సంప్రదించలేదు. కొంత కాలానికి సమస్యలు తీవ్రం కావడంతో భార్య ఒత్తిడి మీద వైద్యుల వద్దకు వెళ్లక తప్పలేదు. అతడికి బౌల్ కేన్సర్ (కోలన్ కేన్సర్) అని బయట పడడంతో విచారంలో ముగినిపోయాడు. 

బౌల్ కేన్సర్
దీన్నే కోలన్ కేన్సర్, పెద్ద పేగు కేన్సర్ అని కూడా అంటారు. పెద్ద పేగులోని టిష్యూలో ప్రాణాంతక కేన్సర్ కణాలు చేరతాయి. ఎక్కువగా వెలుగు చూస్తున్న కేన్సర్ కేసుల్లో ఇది కూడా రకం. కుటుంబ చరిత్ర, అధిక రిస్క్ అడెనోమస్ లేదా పాలిప్స్, ఊబకాయం, పొగతాగడం, మద్యపానం ఈ సమస్యకు కారణం కావచ్చు. 

ప్రఖ్యాత మయోక్లినిక్ నిర్వచనం ప్రకారం.. కోలన్ కేన్సర్ సాధారణంగా పెద్ద వయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అదే సమయంలో ఏ వయసులో అయినా రావచ్చు. తొలుత పెద్ద పేగుల్లో పాలిప్స్ మాదిరిగా మొదలవుతుంది. ఆ తర్వాత కొంత కాలానికి కేన్సర్ గా మారుతుంది. నిర్లక్ష్యం చేయకుండా టెస్ట్ చేయించుకోవాలి. దీనివల్ల పాలిప్స్ కేన్సర్ గా మారకముందే తీసి వేయించుకోవడానికి వీలు పడుతుంది.

సాధారణంగా కనిపించే లక్షణాలు
కడుపులో చాలా అసౌకర్యంగా అనిపించడం.. మల విసర్జన ఒకేసారి పూర్తి చేయలేకపోవడం.. పలు సార్లు వెళ్లాల్సి రావడం, ప్రేగు కదలికలు అసౌకర్యంగా అనిపించడం ఇవన్నీ సంకేతాలే. ఈ లక్షణాలు పెద్ద ప్రేగు కేన్సర్ సూచికలు కావచ్చు. ముఖ్యంగా మలంలో రక్తం కనిపిస్తుంటే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. సరైన సమయంలో గుర్తించి చికిత్స చేయకపోతే ఇది కేన్సర్ గా మారి కాలేయానికి, ఆ తర్వాత ఊపిరితిత్తులకు వ్యాపిస్తుంది. 

బరువు తగ్గడం
కారణం లేకుండా ఒక్కసారిగా బరువు తగ్గుతుంటే అది కేన్సర్ అనే అనుమానించడం ఎందుకైనా మంచిది. అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ నిపుణులు తమ వద్దకు వచ్చే కేన్సర్ కేసుల్లో 40 శాతం మంది బరువు తగ్గే సమస్యను చూసినట్టు చెబుతున్నారు.


More Telugu News