టీడీపీ నేత చింతమనేనిపై ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు

  • ఏలూరు జిల్లా అంకంపాలెంలో టీడీపీ ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం
  • అక్కడికొచ్చి వాగ్వివాదానికి దిగిన వైసీపీ సర్పంచ్, ఇతర నేతలు
  • ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదైంది. సర్పంచ్ తొమ్మండ్రు భూపతి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం పంచాయతీ పరిధిలోని అంకంపాలెంలో సోమవారం రాత్రి టీడీపీ ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో పాల్గొన్న చింతమనేని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.

విషయం తెలిసిన స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్, వైసీపీ నేతలు అక్కడికెళ్లి టీడీపీ నాయకులతో వాగ్వివాదానికి దిగారు. ఇక్కడికొచ్చి తమ నాయకుడిని అవమానిస్తారా? అని ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. చింతమనేని స్పందిస్తూ రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు తనకుందని అన్నారు. అనంతరం సర్పంచ్ తొమ్మండ్రు భూపతి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని చింతమనేని తమను కులం పేరుతో దూషించారని ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. 

మరోవైపు, టీడీపీ నేతలు కూడా వైసీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై సర్పంచ్ భూపతి, ఉప సర్పంచ్ రమేష్‌రెడ్డి, మరో ఐదుగురు దాడి చేశారని, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని టీడీపీ నాయకుడు రాజశేఖర్‌రెడ్డి ఫిర్యాదు చేయడంతో సర్పంచ్, ఉప సర్పంచితోపాటు మరో ఐదుగురిపై కేసు నమోదైంది.


More Telugu News