కాంగ్రెస్‌కు షాకిచ్చిన ప్ర‌శాంత్ కిశోర్‌

  • పార్టీలో చేరాలంటూ సోనియా ఆహ్వానం
  • తిర‌స్క‌రించిన ప్ర‌శాంత్ కిశోర్‌
  • ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా ధ్రువీక‌ర‌ణ‌
  • కాసేపటి క్రితం స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించిన పీకే
రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీకి గ‌ట్టి షాకే ఇచ్చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరేది లేదంటూ ప్ర‌శాంత్ కిశోర్ చెప్పేశారు. ఈ మేర‌కు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్ర‌శాంత్ కిశోర్ తిర‌స్క‌రించిన విష‌యాన్ని ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రణదీప్ సూర్జేవాలా వెల్ల‌డించారు. నిర్దిష్ట‌మైన బాధ్య‌త‌ల‌తో పార్టీలో చేరాల‌ని స్వ‌యంగా సోనియా ప్ర‌తిపాదించ‌గా..అందుకు ప్ర‌శాంత్ కిశోర్ నిర్ద్వంద్వంగా తిర‌స్క‌రించారు. ఈ విషయాన్ని ప్రశాంత్ కిశోర్ కూడా తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

ఇటీవ‌లి కాలంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో వ‌రుస భేటీలు నిర్వ‌హిస్తున్న ప్ర‌శాంత్ కిశోర్ ఆ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నార‌న్న వార్త‌లు వినిపించాయి. పార్టీలోకి పీకే చేరిక‌ను వ్య‌తిరేకిస్తున్న కొంద‌రు నేత‌ల‌ను ఒప్పించే ప‌నిని సోనియా చేప‌ట్టార‌ని, సోనియా చ‌ర్చ‌ల‌తో వారు కూడా మెత్త‌బ‌డ్డార‌న్న వార్త‌లూ వినిపించాయి. అంతేకాకుండా ప్ర‌శాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరిపోవ‌డం ఖాయ‌మైపోయింద‌ని, ఆయ‌న‌కు పార్టీ కీల‌క బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించ‌నుంద‌ని కూడా ప్రచారం సాగింది. ఇలాంటి నేప‌థ్యంలో పార్టీలో చేరేందుకు ప్ర‌శాంత్ నిరాక‌రించార‌న్న వార్త‌లు ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిరాకరించిన ప్రశాంత్ కిశోర్.. ఆ పార్టీకి వ్యూహకర్తగా కొనసాగేందుకు మాత్రం అంగీకరించారు. 


More Telugu News