కంటి చూపు మెరుగవ్వాలంటే ‘పెన్ను’తో ఈ వ్యాయామాలు చేస్తే మంచి ఫలితాలు!

  • 4 నుంచి 5 వారాల పాటు రోజూ 30 సార్లు సాధన
  • వాటితో పాటు మంచి ఆహారమూ తీసుకోవాలి
  • కంటి నిండా నిద్రపోవాలి
  • సిగరెట్ మానేయాల్సిందే
చూపులేని జీవితం నరకమన్నది తెలిసిందే. కాలం గడుస్తున్న కొద్దీ.. వయసు పెరిగే కొద్దీ చూపు మందగించడం సహజం. అయితే, ఈ కాలం పిల్లల్లోనూ చూపు చిన్న వయసులోనే మందగిస్తోంది. మరి, చూపును పెంపొందించుకోవాలంటే విటమిన్లు, పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారమే తీసుకోవాలా? అద్దాలు మాత్రమే పెట్టుకోవాలా? అంటే.. వాటితో పాటు ‘పెన్ను’తో ఈ రెండు చిన్న వ్యాయామాలూ చేయాలంటున్నారు నిపుణులు. 

 ఓ పెన్నును తీసుకుని ముక్కుకు 35 సెంటీమీటర్ల దూరంలో పెట్టాలి. ఆ పెన్ను కొనంచునే దీర్ఘంగా చూడాలి. దాని మీద దృష్టి పూర్తిగా కేంద్రీకృతమయ్యాక.. పెన్నును ముక్కుకు దగ్గరగా తీసుకురావాలి. పెన్ను రెండుగా కనిపించేంతవరకు అలాగే చెయ్యాలి. ఆ తర్వాత కళ్లను రిలాక్స్ చేసేందుకు పెన్నును కదిలించకుండా.. దూరంగా ఉన్న ఏదైనా వస్తువుపై చూడాలి. రిలాక్స్ అయ్యాక మళ్లీ అదే వ్యాయామాన్ని 30 సార్లు రిపీట్ చేయాలి. 4 నుంచి 5 వారాల పాటు రోజు ఈ వ్యాయామం చేస్తే మంచి ఫలితాలొస్తాయి. 

రెండో వ్యాయామంలో భాగంగా మొదటి ఎక్సర్ సైజుకు పూర్తి వ్యతిరేకంగా ఎక్సర్ సైజును చేయాల్సి ఉంటుంది. ముక్కుకు పెన్నును దగ్గరగా పెట్టుకోవాలి. పెన్ను ఒక్కటి మాత్రమే కనిపించేంత వరకు దానిని చూడాలి. ఈ వ్యాయామంతో కంటిపై కొంత స్ట్రెస్ పడినా.. సింగిల్ ఇమేజ్ మాత్రమే కనిపించేంత వరకు ఉంచాలి. ఓసారి సింగిల్ ఇమేజ్ కనిపించాక కొన్ని సెకన్ల పాటు పెన్నునే చూడాలి. ఆ తర్వాత నెమ్మదిగా దూరంలో ఉన్న వస్తువుపై దృష్టిని మళ్లిస్తూ కళ్లను రిలాక్స్ చేయాలి. మళ్లీ పెన్నుపై దృష్టి కేంద్రీకృతం చేయాలి. ప్రతి మూడు సెకన్లకోసారి ఇలా చేయాలి. రోజూ 30 సార్లు ఇలా చేస్తే చూపు మెరుగయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

ఇవీ ముఖ్యమే...

  • కంటి చూపును మెరుగపరిచే ఆహారాన్ని బాగా తీసుకోవాలి. పండ్లు, ఎండు ఫలాలు, గింజలు, గుడ్లు, మొలకలు, పచ్చి కూరగాయలు, క్యారెట్, చేపలు, పాలకూర వంటి వాటిని కచ్చితంగా తినాలి. 
  • కంటి నిండా నిద్ర పోవాలి. టీవీగానీ.. ల్యాప్ టాప్ లేదా ట్యాబ్ లేదా ఫోన్ ను చాలా ఎక్కువగా చూసినట్టయితే కూలింగ్ ఐ ప్యాడ్స్ తో కళ్లకు విశ్రాంతినివ్వాలి. 
  • చదివేటప్పుడు డిమ్ (వెలుతురు తక్కువున్న దీపాలు) లైట్లను అస్సలు వాడకూడదు. ఫ్లోరోసెంట్ లైట్లను దూరం పెట్టాలి.
  • సిగరెట్ అలవాటు ఉంటే వెంటనే మానెయ్యాలి. 
  • ఆరు నెలలకోసారి కళ్ల పరీక్ష చేయించుకోవాలి. 
  • కంటి చూపును మెరుగుపరిచేందుకు కేవలం పెన్ను ఎక్సర్ సైజుల మీదే ఆధార పడకూడదు. వేరే ఎక్సర్ సైజులూ ఉన్నాయి. అరచేతులను బాగా రుద్ది.. వెచ్చగా మారిన ఆ అరచేతులను కళ్లపై అదమాలి. ఓ ఐదు క్షణాల పాటు అలా కళ్లపై అరచేతులను ఆనించి ఉంచాలి. రోజూ కళ్లను పది సార్లు గుండ్రంగా తిప్పాలి. రెండు వైపులా తిప్పుతూ ఉండాలి. 


More Telugu News