రఘురామ లేఖపై చర్యలు తీసుకోండి: ఏపీ సీఎస్‌కు కేంద్రం ఆదేశం

  • భార్యను వేధించిన అధికారికి ‘దిశ’ చట్టం పర్యవేక్షణ బాధ్యతలా? అని రఘురామ ప్రశ్న
  • ఆయనపై కేసు త్వరలోనే ట్రయల్స్‌కు రాబోతోందని వెల్లడి 
  • రఘురామ లేఖపై చర్యలు తీసుకోవాలని కేంద్రం లేఖ
  • చర్యల నివేదికను తమకు సమర్పించాలని ఆదేశం
గృహ హింస కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్‌పై తెలంగాణ పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారని, ఈ కేసు త్వరలోనే ట్రయల్స్‌కు రాబోతోందంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు రాసిన లేఖపై కేంద్ర హోంశాఖ స్పందించింది. రఘురామరాజు ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సీఎస్‌కు లేఖ రాసింది. 

20 ఏళ్లపాటు కాపురం చేసిన భార్యను దారుణంగా వేధించిన అధికారికి మహిళలపై వేధింపుల నిరోధానికి ఉద్దేశించిన ‘దిశ’ చట్టం పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడమంటే మహిళల భద్రతను కాలరాయడమేనని రాఘురామ ఆ లేఖలో ఆరోపించారు. కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాదు, సునీల్ కుమార్ తన కుటుంబ సభ్యులను వేధిస్తూ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి తమ హత్యకు కుట్ర చేస్తున్నారంటూ ఆయన మామ ఏపీ హైకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేసినట్టు గుర్తు చేశారు. 

అలాగే, నిబంధనలకు విరుద్ధంగా అంబేద్కర్స్ మిషన్ ఏర్పాటు చేసి జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి విరాళాలు కూడా సేకరిస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపైనా దర్యాప్తు జరిపించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు రాసిన లేఖలో రఘురామ పేర్కొన్నారు. స్పందించిన హోంశాఖ ఏపీ సీఎస్‌కు లేఖ రాస్తూ.. రఘురామ ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని, చర్యల నివేదికను తమకు సమర్పించాలని ఆదేశించింది.


More Telugu News