సీఎం జగన్ ను కలిసిన నాల్కో, మిథానీ సీఎండీలు

  • క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన సీఎండీలు
  • సీఎం జగన్ తో సమావేశం
  • నెల్లూరు జిల్లాలో అల్లాయ్ పరిశ్రమ
  • రూ.5.500 కోట్లతో పరిశ్రమ
ప్రభుత్వ రంగ సంస్థలు నాల్కో సీఎండీ శ్రీధర్ పాత్ర, మిథానీ సీఎండీ సంజయ్ కుమార్ ఝా ఏపీ సీఎం జగన్ ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. నాల్కో, మిథానీ భాగస్వామ్య సంస్థ ఉత్కర్ష అల్యూమినియం ధాతునిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా బొడ్డువారిపాలెం వద్ద హైఎండ్ అల్యూమినియం అల్లాయ్ ఉత్పత్తుల తయారీ పరిశ్రమ స్థాపనపై వారు సీఎం జగన్ తో చర్చించారు. 

ఈ పరిశ్రమ రూ.5,500 కోట్లతో ఏర్పాటు కానుంది. పరిశ్రమ వార్షిక ఉత్పాదక సామర్థ్యం 60 వేల మెట్రిక్ టన్నులు. వచ్చే రెండున్నరేళ్ల లోపు ప్రాజెక్టు పూర్తి చేయాలని సంకల్పించారు. దీని ద్వారా భారీ సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 

కాగా, ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనపై ఎదురవుతున్న సమస్యలను నాల్కో, మిథానీ సీఎండీలు నేటి సమావేశంలో సీఎం జగన్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన సీఎం జగన్... ఆయా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్ ఓ ప్రతిపాదన చేశారు. ఈ ప్రాజెక్టుకు అనుబంధంగా, రక్షణ అనుబంధ రంగాలకు సంబంధించిన పరికరాల తయారీదారుల అవసరాలు తీర్చేందుకు ఎంఎస్ఎంఈ పార్కును కూడా ఏర్పాటు చేయాలని సీఎం జగన్ సీఎండీలకు సూచించారు. ఏపీ సీఎం ప్రతిపాదనకు నాల్కో, మిథానీ సీఎండీలు అంగీకారం తెలిపారు.


More Telugu News