బెయిల్ లభించిన కాసేపటికే జిగ్నేశ్ మేవానీ మళ్లీ అరెస్ట్

  • మోదీపై వ్యాఖ్యల కేసు ఎదుర్కొంటున్న మేవానీ
  • గత గురువారం పలన్ పూర్ లో అరెస్ట్
  • బెయిల్ ఇచ్చిన కోక్రాఝార్ కోర్టు
  • ఈసారి మేవానీని అదుపులోకి తీసుకున్న బార్పెట్టా పోలీసులు
ప్రధాని నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ వ్యవహారంలో నేడు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మోదీపై వ్యాఖ్యల కేసులో మేవానీకి అసోంలోని కోక్రాఝార్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, మేవానీ ఊపిరి పీల్చుకునే లోపే పోలీసులు ఆయనను మరోసారి అరెస్ట్ చేశారు. 

అసోంలోని బార్పెట్టాకు చెందిన పోలీసులు మేవానీని అదుపులోకి తీసుకున్నారు. ఆయనను మళ్లీ ఎందుకు అరెస్ట్ చేశారన్న దానికి స్పష్టమైన కారణం తెలియరాలేదు. అయితే, ఓ ప్రభుత్వ అధికారి విధులకు అడ్డం తగిలారన్న కేసులో జిగ్నేష్ మేవానీని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. 

కాగా, తనను అసోం పోలీసులు అరెస్ట్ చేయడంపై మేవానీ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధానమంత్రి కార్యాలయం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. "ఇది బీజేపీ, ఆర్ఎస్ఎస్ ల కుట్ర. నా ప్రతిష్ఠను దెబ్బతీయడానికే ఇదంతా చేశారు. ఇదంతా ఓ పద్ధతి ప్రకారం చేస్తున్నారు. గతంలో రోహిత్ వేములకు కూడా ఇలాగే జరిగింది. చంద్రశేఖర్ ఆజాద్ కు ఇలాగే జరిగింది. ఇప్పుడు వాళ్లు నన్ను టార్గెట్ చేశారు" అని వ్యాఖ్యానించారు.


More Telugu News