ఎంఎఫ్ హుస్సేన్ ‘రాజీవ్’ పెయింటింగును బలవంతంగా కొనిపించారన్న రాణాకపూర్.. బీజేపీ-కాంగ్రెస్ మాటల యుద్ధం!

  • ఎంఎఫ్ హుస్సేన్ రాజీవ్ చిత్రపటాన్ని రూ. 2 కోట్లకు కొనిపించారన్న రాణా కపూర్
  • ఆ సొమ్మును సోనియా చికిత్స కోసం వాడుకున్నారని వెల్లడి 
  • పద్మభూషణ్ పురస్కారాలను అమ్ముకునే స్థాయికి కాంగ్రెస్ దిగజారిందన్న బీజేపీ
  • జైల్లో ఉన్న మోసగాడి మాటలను ఎలా నమ్ముతారన్న కాంగ్రెస్
యస్ బ్యాంకు సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వేడి పుట్టించాయి. బీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యద్ధానికి దారి తీశాయి. ఈడీ విచారణ సందర్భంగా రాణా కపూర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఒత్తిడి కారణంగా ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ గీసిన ‘రాజీవ్’ చిత్రపటాన్ని తాను రూ. 2 కోట్లకు కొనాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు.

రాణా వ్యాఖ్యలను వెంటనే అందిపుచ్చుకున్న బీజేపీ.. కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. గాంధీ కుటుంబం పేరుతో కాంగ్రెస్ అక్రమ వసూళ్లకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. పద్మభూషణ్ లాంటి అత్యున్నత పురస్కారాలను అమ్ముకునే స్థాయికి ఆ పార్టీ దిగజారిపోయిందని ఎద్దేవా చేసింది.

బీజేపీ విమర్శలకు కాంగ్రెస్ కూడా గట్టిగానే బదులిచ్చింది. ఎప్పుడో 2010లో జరిగిన లావాదేవీని ఇప్పుడు రాజకీయం చేయడమేంటని ప్రశ్నించింది. 20-30 బెయిలు దరఖాస్తులు తిరస్కరణకు గురై, చాలా ఏళ్లపాటు జైలులో ఉన్న మోసగాడు చేసే అసత్య ఆరోపణలను ఎలా నమ్ముతారని నిలదీసింది. చనిపోయిన వ్యక్తులపై అసత్య ఆరోపణలు చేస్తే రాజకీయ లబ్ధి కలుగుతుందని ప్రభుత్వంలో ఉన్నవారు ఆనందపడడం అసహ్యంగా ఉందని కౌంటరిచ్చింది.

కాగా, ఈడీ విచారణలో రాణాకపూర్ మాట్లాడుతూ.. ఎంఎఫ్ హుస్సేన్ రాజీవ్‌గాంధీ పెయింటింగ్‌ను ప్రియాంక గాంధీ నుంచి కాంగ్రెస్ నేతలు తనతో బలవంతంగా రూ. 2 కోట్లకు కొనిపించారని పేర్కొన్నారు. ఆ డబ్బును న్యూయార్క్‌లో సోనియా చికిత్స కోసం గాంధీ కుటుంబం వాడుకుందని ఆరోపించారు. పెయింటింగును కొనకుంటే గాంధీ కుటుంబంతో సత్సంబంధాలు ఏర్పడవని, పద్మభూషణ్ కూడా రాదని అప్పటి పెట్రోలియం శాఖ మంత్రి మురళీ దేవరా తనను బెదిరించారని అన్నారు. 

అంతేకాదు, పెయింటింగ్ కొని సరైన సమయంలో గాంధీ కుటుంబానికి సాయం చేశారంటూ సోనియాగాంధీ రాజకీయ సలహాదారు దివంగత అహ్మద్ పటేల్ తనకు ధన్యవాదాలు తెలిపారని, తన పేరును పద్మభూషణ్ అవార్డుకు పరిశీలిస్తామని హామీ కూడా ఇచ్చారని రాణాకపూర్ ఈడీకి తెలిపారు. ఇప్పుడు ఇవే వ్యాఖ్యలు కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి.


More Telugu News