ఏపీలో విద్యుత్ రంగ సమస్యలపై మంత్రి పెద్దిరెడ్డి ఏమన్నారంటే...!

  • విద్యుత్ సంస్థల అధికారులతో టెలీకాన్ఫరెన్స్
  • బొగ్గు కొరత తీవ్రంగా ఉందని వెల్లడి
  • దిగుమతి కూడా కష్టంగా మారిందని వివరణ
  • మే మొదటివారం నాటికి అధిగమిస్తామని ధీమా
విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులతో ఏపీ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ రంగ సమస్యలను వివరించారు. దేశంలో బొగ్గు కొరత విద్యుత్ సమస్యలకు కారణం అని వెల్లడించారు. కరోనా సంక్షోభం, భారీ వర్షాలు బొగ్గు ఉత్పాదనను ప్రభావితం చేశాయని, దానికితోడు ఉక్రెయిన్ సంక్షోభం ప్రభావం కూడా బొగ్గు లభ్యతపై పడిందని వివంరించారు. బొగ్గు కొరత వల్ల అనేక పెద్ద రాష్ట్రాలు తీవ్ర విద్యుత్ కొరతతో సతమతమవుతున్నాయని అన్నారు.

థర్మల్ ప్లాంటులో 24 రోజులకు సరిపడా నిల్వలు ఉంచుకోవడం నిబంధనల్లో భాగమని, కానీ, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. అనేక రాష్ట్రాల్లోని థర్మల్ ప్లాంట్లలో చూస్తే రెండు నుంచి ఐదు రోజులకు సరిపోయే బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయని వివరించారు. గతంతో పోల్చితే ప్రస్తుతం బొగ్గు ధరలు రికార్డు స్థాయికి చేరాయని, దిగుమతి చేసుకోవడం కూడా క్లిష్టంగా మారిందని అన్నారు. 

బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలుకు అనేక రాష్ట్రాలు బారులు తీరుతున్నాయని, దాంతో విద్యుత్ కొనుగోలు ధర అమాంతం పెరిగిపోయిందని చెప్పారు. అందుకే ఆయా రాష్ట్రాల బాటలో ఏపీలోనూ విద్యుత్ సరఫరాపై ఆంక్షలు విధించక తప్పలేదని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. అయితే ఏపీలో విద్యుత్ కొరతను తాము అధిగమించగలని, ఈ పరిస్థితి తాత్కాలికమేనని భావిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. మే మొదటి వారం నాటికి ఏపీలో విద్యుత్ సమస్యలు చక్కబడతాయని అన్నారు.


More Telugu News