సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేయడంతో లొంగిపోయిన కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడు

  • లఖింపూర్ లో అక్టోబరు 3న రైతుల ప్రదర్శన
  • నిరసన ప్రదర్శనపైకి దూసుకెళ్లిన కారు
  • 8 మంది మృతి
  • కారును నడిపినట్టు ఆశిష్ మిశ్రాపై ఆరోపణలు
లఖింపూర్ హింస కేసులో ప్రధాన నిందితుడు, కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా లొంగిపోయారు. లఖింపూర్ లో శాంతియుత ప్రదర్శనపైకి కారుతో వేగంగా దూసుకెళ్లి నలుగురు రైతుల సహా 8 మంది మృతికి కారకుడయ్యాంటూ ఆశిష్ మిశ్రాపై తీవ్ర అభియోగాలు మోపడం తెలిసిందే. 

అయితే, ఆశిష్ మిశ్రాకు ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు  బెయిల్ మంజూరు చేయగా, సుప్రీంకోర్టు ఆ బెయిల్ ను గతవారం రద్దు చేసింది. బాధితులు తమ వాదనలను వినిపించేందుకు అలహబాద్ హైకోర్టులో అవకాశం దొరకలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో, ఆశిష్ మిశ్రా లఖింపూర్ లోని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో నేడు లొంగిపోయారు. 

అంతకుముందు, లఖింపూర్ కేసుకు సంబంధించి దర్యాప్తు కోసం యూపీ ప్రభుత్వం సిట్ వేయగా, ఓ రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోనే దర్యాప్తు జరగాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.


More Telugu News