జమ్మూకశ్మీర్ లో రూ.20 వేల కోట్ల అభివృద్ధి పనులు.. ప్రారంభించిన ప్రధాని మోదీ

  • పల్లీ గ్రామంలో 500 కిలోవాట్ల సౌర విద్యుత్ కేంద్రం
  • చినాబ్ నదిపై రెండు భారీ జల విద్యుత్ ప్రాజెక్టులు
  • కశ్మీర్ కు అభివృద్ధి సందేశాన్ని మోసుకొచ్చానన్న ప్రధాని
ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి జమ్మూకశ్మీర్ లో పర్యటించారు. సాంబా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఢిల్లీ–అమృత్ సర్–కాత్రా ఎక్స్ ప్రెస్ వేకు ఆయన శంకుస్థాపన చేశారు. పల్లీ గ్రామంలో 500 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ను ప్రారంభించారు. 8.45 కిలోమీటర్ల పొడవున రూ.3,100 కోట్లతో నిర్మించిన బనిహాల్–ఖాజీగంద్ రోడ్డు సొరంగాన్ని ప్రారంభించారు. చినాబ్ నదిపై 850 మెగావాట్ల రాటిల్ జలవిద్యుత్ కేంద్రం, 540 మెగావాట్ల క్వార్ జలవిద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ రెండు భారీ జలవిద్యుత్ కేంద్రాలను కిష్వార్ జిల్లాలో నిర్మించనున్నారు. అనంతరం పల్లీ గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మాట్లాడారు. 

 జమ్మూకశ్మీర్ కు అభివృద్ధి అనే సందేశాన్ని తాను మోసుకొచ్చానని చెప్పారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని, రూ.20 వేల కోట్ల అభివృద్ధి పనులను తాను ఇవాళ ప్రారంభించానని ప్రకటించారు. పల్లీ గ్రామం దేశంలోనే తొలి కర్బన ఉద్గారాల్లేని పంచాయతీగా నిలిచిందని మోదీ అన్నారు. 

ఈ ఏడాది పంచాయతీ దినోత్సవాన్ని జమ్మూలో జరుపుకొంటున్నామన్నారు. ప్రజాస్వామ్యం మూల స్థాయుల వరకు వెళ్లిందన్నారు. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ లేకపోవడం వల్ల జమ్మూ ప్రజలు తీవ్ర అన్యాయానికి గురయ్యారని, అయితే, జమ్మూకశ్మీర్ ప్రజల సాధికారత కోసం తాము అన్ని కేంద్ర చట్టాలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. 

ఎన్నో ఏళ్లుగా జమ్మూకశ్మీర్ ప్రజలకు అమలు కాని రిజర్వేషన్లు ఇప్పుడు అమలవుతున్నాయని పేర్కొన్నారు. తమ పూర్వీకులు ఎదుర్కొన్న సమస్యలను ఇప్పటి యువత ఎదుర్కోబోదని చెప్పారు. సర్వకాలసర్వావస్థల్లో మిగతా దేశంతో జమ్మూకశ్మీర్ ను అనుసంధానించేలా చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. 

ప్రస్తుతం జమ్మూకశ్మీర్ లో పర్యాటక రంగానికి ఊపు వచ్చిందన్నారు. నీటి సమస్య తొలగిపోయేలా పంచాయతీల్లో మహిళలను భాగస్వాములను చేశామని చెప్పారు. రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లేలా పంచాయతీలు ప్రోత్సహించాలని సూచించారు. 

రసాయనాల నుంచి భూమిని కాపాడాలని, కాబట్టి రైతులు ఈ దిశగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. పంచాయతీ అయినా, పార్లమెంట్ అయినా.. పనేది చిన్నది కాదని ప్రధాని మోదీ అన్నారు. వాటి వల్లే మన దేశాభివృద్ధి మరింత జరుగుతుందని చెప్పారు.


More Telugu News