పోలవరంలో తప్ప... ప్రపంచంలో ఇంకెక్కడా డయాఫ్రం వాల్ దెబ్బతినలేదు: మంత్రి అంబటి రాంబాబు

  • గత ప్రభుత్వ తప్పిదం వల్లే డయాఫ్రం వాల్ పాడైందన్న అంబటి 
  • కాఫర్ డ్యాం, అప్రోచ్ కెనాల్ పూర్తి చేయకుండానే డయాఫ్రం వాల్ కట్టారని విమర్శ 
  • డయాఫ్రం వాల్ మళ్లీ కట్టాలా? లేక కొత్తది నిర్మించాలా? అన్న దానిపై అధ్యయనం అవసరమన్న మంత్రి 
ఇటీవల ఏపీ నీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టు అంశంపై స్పందించారు. 2018 నాటికే పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు అన్నారని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ పాడయ్యేందుకు గత ప్రభుత్వ తప్పిదమే కారణమని ఆరోపించారు. 

కాఫర్ డ్యాం, అప్రోచ్ కెనాల్ పూర్తి చేయకుండానే డయాఫ్రం వాల్ కట్టారని వివరించారు. కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్ కట్టాక స్పిల్ వే నిర్మించాల్సి ఉంటుందని అంబటి పేర్కొన్నారు. అలాంటిది కాఫర్ డ్యాం సగంలో ఉండగానే డయాఫ్రం వాల్ నిర్మించడం తప్పు అని విమర్శించారు. 

డయాఫ్రం వాల్ ఏర్పడిన గుంతలు పూడ్చేందుకు ఖర్చు రూ.800 కోట్లు, డయాఫ్రం వాల్ లోని నీటిని ఎత్తిపోసేందుకు ఖర్చు రూ.2,100 కోట్లు అని వెల్లడించారు. డయాఫ్రం వాల్ దెబ్బతిందని 2020 మార్చి 8న గుర్తించారని అంబటి తెలిపారు. ఒక్క పోలవరంలో తప్ప, ప్రపంచంలో ఎక్కడా డయాఫ్రం వాల్ దెబ్బతిన్న ఉదంతాలు లేవని గత ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 

దెబ్బతిన్న డయాఫ్రం వాల్ మళ్లీ కట్టాలా? లేక కొత్తది నిర్మించాలా? అనేదానిపై అధ్యయనం అవసరమని, పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామనేది పరిశీలించి చెబుతామని స్పష్టం చేశారు. పోలవరంపై ఏ అంశంలోనైనా తాము చర్చకు సిద్ధమని అంబటి రాంబాబు ప్రకటించారు.


More Telugu News